'గెలిచి ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాలి' కాంగ్రెస్ కంచుకొటైన హుజూర్ నగర్లో గెలవడం ద్వారా తెరాసకు తామే ప్రత్యామ్నాయమనే వాదనను నిరూపించుకోవాలని భాజపా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస చేరికలతో జోరుమీదున్న కాషాయం పార్టీ అదే జోరును కొనసాగించాలంటే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో కమలనాథులు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
గెలుపు గుర్రం కోసం అన్వేషణ:
హుజూర్ నగర్ ఎన్నికపై ముందే కన్నేసిన కమలం పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్కు.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, ప్రధాన ఎన్నికల ఎంజెంట్గా పనిచేసిన రాంరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో హుజూర్నగర్లో భాజపా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అభ్యర్థి విషయంలో రాష్ట్ర నాయకత్వం ఆచితూచి వ్యహరిస్తోంది. గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది.
అప్పిరెడ్డికి అవకాశం ?
2018లో పోటీ చేసి ఓడిపోయిన బోడ భాగ్య రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లు పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వృత్తిరీత్యా వైద్యుడైన కోట రామారావు పేరు పరిశీలనలో ఉండగా.. ప్రవాస భారతీయుడు అప్పి రెడ్డి పేరును ఆలోచిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన కమలదళపతి అమిత్ షాను అప్పి రెడ్డి కలిశారు. అధికారికంగా భాజపాలో చేరనప్పటికీ ఆ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అప్పిరెడ్డి కమలం గూటికి వస్తే.. ఆయనను బరిలోకి దించాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ గరికపాటితో తెదేపా నుంచి భాజపాలో చేరిన శ్రీకళ రెడ్డి పేరును కూడా రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక త్వరితగతిన పూర్తి చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి : 'క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..'