BJP Executive Meeting Concluded In Mahbubnagar: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం దగ్గర పడిందని.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత, అసహ్యం, ద్వేషం ఉన్నాయనన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకులు, దళితులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారన్నారు. 60 మందికి పైగా సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాంత్రిక పాలన సాగుతోందని.. పార్టీ పేరు మార్చాలని ఎవరో సూచిస్తే కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేశారన్నారు.
కాంగ్రెస్‌లో యువరాజు.. బీఆర్ఎస్లో.. కాంగ్రెస్‌లో యువరాజు ఉంటే.. కేసీఆర్ కుటుంబంలో యువరాజుతోపాటు యువరాణి ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కుమారుడు, కుమార్తె, బంధువులు ఎక్కడ ఉన్నారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. దోచుకోవడమే వారి పనని.. మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వాళ్లు.. హోటల్‌కు ఎందుకు వెళ్లారో, మొబైళ్లు ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని నిలదీశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ నిత్యం ఎవరో ఒకరు పార్టీని వీడుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని తరుణ్ చుగ్ పిలుపు నిచ్చారు.
కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో ఆరోజు చెప్పుతాము: జీ20 సమావేశాలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. జీ20 దేశాలకు మోదీ నాయకత్వం వహించడం గొప్ప విషయమన్నారు. జీ20 సమావేశాల్లో మహిళలు సహా అన్నివర్గాలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే అంశంపై పూర్తి గణాంకాలతో నివేదిక సిద్ధం చేస్తున్నామని.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. విమర్శకులు, వామపక్ష భావజాల మేధావులు అందరినీ ఆహ్వానించి కేంద్రం ఏం చేసిందో చెప్తామని, అందుకు రాష్ట్రం సహకరించకుండా.. ఎలా అడ్డుకుంటుందో కూడా వివరిస్తామని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఉపకార వేతనాలు జమ చేసేందుకు వివరాలు అడిగితే ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. సైన్స్ సిటీకి భూమి ఇవ్వడం లేదని, ఎమ్ఎమ్టీఎస్ రెండో దశ విస్తరణకు నిధులు ఇవ్వడం లేదని.. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడల్లో పార్టీ నేతలు దూకుడు పెంచాలని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నాయకులు తమ ఆస్తులను ప్రకటించాలి: అంతకుముందు రెండో రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో.. జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను నేతలు సభ్యులకు వివరించారు. తెలంగాణ సహా 9రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే అంశంపై.. మోదీ, నడ్డా ఇచ్చిన దిశానిర్దేశం, కార్యాచరణపై చర్చించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 9వేల శక్తి కేంద్రాల్లో నిర్వహించే కూడలి సమావేశాల్ని నిర్వహించడంపై చర్చించారు. 27న జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవవర్గంలో 5 పాఠశాల్లో విజయవంతం చేయాలని నిర్ణయించారు. సరళ్ యాప్ ఉద్దేశం, పార్టీ బలోపేతానికి యాప్ ఏవిధంగా ఉపయోగపడుతుంది.. ప్రతి ఒక్క కార్యకర్త సరళ్ యాప్‌ను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై సమావేశం చర్చించింది.