ఖజానా ఖాళీ అయిన ప్రతి సందర్భంలోనూ కొత్త జీవోలు జారీచేసి ప్రజా సొమ్మును ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం సమంజసం కాదని భాజపా నేత శ్యాంసుందర్ తెలిపారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ వంటి చట్టాలను తీసుకువచ్చి ప్రజలపైన మోపడం దారుణమన్నారు. భూక్రమబద్ధీకరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని భాజపా ధర్నా - హైదరబాద్ వార్తలు
ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని, నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో భూక్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు.
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల నుంచి భూక్రమబద్ధీకరణ చట్టం పేరుతో డబ్బులు వసూలు చేయడం హేయమైన చర్య అని శ్యాంసుందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ నిరుపేదలైన లబ్ధిదారులకు మాత్రం రెండు పడక గదుల ఇళ్లు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న జీవోల పనితీరును ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు, మహిళలు పాల్గొని నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: బీసీలకు చదువుకునే హక్కు లేదా..?: ఆర్.కృష్ణయ్య