మున్సిపల్ ఎన్నికలకు భాజపా సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ తెరాసకు తామే ప్రత్యామ్నయంగా చెప్పుకుంటున్న కమలనాథులు... ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని పురపాలికలు, వార్డుల్లో పోటీకి దిగుతున్నారు. గతంలో ప్రభావం చూపించిన పురపాలికలు, నగరపాలికలతోపాటు బలంగా ఉన్న చోట, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే భాజపా విజయదుందుభి మోగించడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు.
ఒంటరి పోరాటం...
పురపాలిక ఎన్నికల్లో భాజపా ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. సీనియర్ నేతలకు మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల కోసం 4నెలలుగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ను మినహాయించి... మిగిలిన 15 పార్లమెంట్ స్థానాలను 15 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు పాత, కొత్త నేతలతో కమిటీ ఏర్పాటు చేసి... ఒక సీనియర్ నేతను పరిశీలకుడిగా నియమించారు. భాజపా ఎంపీలు ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ క్లస్టర్లపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.
గత ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని...
2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భువనగిరి, నారాయణపేట, కామారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో కొంతమేర భాజపా ప్రభావం కనిపించింది. గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీల్లో కూడా కమలనాథులు దృష్టి సారించారు. రాష్ట్రంలో భాజపా వికసిస్తుందనడానికి నాలుగు ఎంపీ స్థానాలు గెలవడమే తార్కాణమని నేతలు చెబుతూ వస్తున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయని... అధికారంలోకి వస్తామని పదేపదే వల్లెవేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉనికి చాటుకునేందుకు పెద్ద ఎత్తున వ్యూహ రచనలు చేస్తున్నారు.
'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం' - 'ఒంటిరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'
పురపాలిక ఎన్నికల నగారా మోగటంతో కమలనాథులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో పాగా వేయటానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం... ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది.
!['ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం' bjp decide to participate on municipal election on single](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5632303-30-5632303-1578441090792.jpg)
కాంగ్రెస్ కంటే ఎక్కువ మున్సిపాలిటీలు గెలిస్తేనే.. రానున్న శాసనసభ ఎన్నికల్లో బలం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు దీటుగా ఫలితాలు తీసుకురావాలని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశించింది. అవసరమైతే ప్రచారానికి కేంద్ర మంత్రులతోపాటు జాతీయ నేతలను పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. హుజూర్‌నగర్ ఫలితాలు పునరావృతం కాకుండా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మూడు నెలలుగా కసరత్తు చేస్తున్న కమలనాథులు... ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో వేచి చూడాలి.
ఇవీ చూడండి: పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
TAGGED:
కమలనాథులు కసరత్తు