రాష్ట్రంలో త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు వరంగల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటి అధికార తెరాసకు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కమళదళం యోచిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కమిటీలతో పాటు సన్నాహాక సమావేశాలతో ప్రచారాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తోంది.
ప్రత్యామ్నాయం తామేనని...
రేపో, మాపో పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండడం వల్ల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. అందివచ్చిన ప్రతి అంశాన్ని తన వైపు అనుకూలంగా మల్చుకుంటోంది. ఈ ఎన్నికలు తెలంగాణలో 60 నుంచి 70 శాతం వరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2023లో జరగబోయే ఎన్నికల్లో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే సంకేతాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తే అధికారం ఖాయమని అంచనా వేస్తోంది.
విస్తృత ప్రచారం...
ఇప్పటికే రెండు పట్టభద్రుల స్థానాల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు బరిలోకి దిగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల తెరాస ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధానంగా తీసుకెళ్లతూనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.