తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం

పట్టభద్రుల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. ఒక వైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌.. మరోవైపు బూత్‌స్థాయి నుంచే ప్రచారం సాగిస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో దూకుడు మీద ఉన్న భాజపా అదే తరహాలో పట్టభద్రులను కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను ప్రచార పర్వంలోకి దింపుతోంది. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ హైదరాబాద్‌కు రానున్నారు.

bjp-campaign-planning-for-telangana-graduate-mlc-elections
పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం

By

Published : Feb 27, 2021, 2:58 PM IST

తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం భాజపా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలను కట్టబెట్టింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధిష్ఠానానికి తెలియజేస్తూ... రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశనంలో ముందుకు సాగుతోంది.

తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు..

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును తిరిగి బరిలో నిలిపింది. గతం కంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాజీ మంత్రులు డీకే.అరుణ, చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డితో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు భాజపాలో చేరారు. వీరి బలం కూడా తోడవుతోందని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకోడం అంత కష్టమేమి కాకపోయినా.. అత్యధిక మెజార్టీ సొంతం చేసుకోని తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తోంది.

25 ఓటర్లకు ఒక బాధ్యుడు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిని భాజపా బరిలోకి దింపింది. ఈ స్థానానికి గట్టిపోటీ నెలకొంది. హేమాహేమీలు ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్‌, రాణీరుద్రమదేవి, తీన్మార్ ‌మల్లన్నతో పాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో గెలిచేందుకు చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థిపైనే పల్లా రాజశ్వర్‌రెడ్డి గెలుపొందడంతో ఈసారి పార్టీ పుంజుకోవడం.. ప్రస్తుత ఎమ్మెల్సీ, ప్రభుత్వంపైన వ్యతిరేకత కలిసివస్తోందని కాషాయదళం యోచిస్తోంది. రెండు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రతి 25 ఓటర్లకు ఒక బాధ్యుణ్ని నియమించి శిక్షణ కూడా పూర్తి చేశారు.

ప్రచారానికి జాతీయ నాయకులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాదిరి ప్రచారం హోరెత్తించాలని భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారానికి రానున్నట్లు ప్రకటించింది. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ ‌జావడేకర్ హైదరాబాద్‌కు రానున్నారు. పట్టభద్రలతో సమావేశం కానున్నారు. నిర్మలా సీతారామన్, కిషన్‌ రెడ్డి, రాంమాధవ్‌లు పట్టభద్రులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం. అవసరమైతే కీలక నేతలు ప్రచారానికి వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

అదే సంకల్పంతో..

రెండు పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుంటే 60 శాతం తెలంగాణ మీద ప్రభావం చూపిస్తుందని.. ఈ ఫలితాలతో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్ఫంతో కాషాయదళం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details