BJP Campaign in Telangana 2023 : శాసనసభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెందిన అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే.. బీజేపీ మాత్రం (BJP Campaign in Telangana) ఈ రెండు పార్టీలకు దీటుగా ప్రచారం చేయలేకపోతోంది. కేవలం పార్టీ అభ్యర్థులు మాత్రమే చెమటోడ్చుతున్నారు.
తెలంగాణ నాయకులు మాత్రం అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు.. పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమ తరఫున ప్రచారం చేసేందుకు రావాలని.. రాష్ట్ర అధ్యక్షుడుకిషన్‌రెడ్డితో(BJP Telangana president Kishan Reddy) పాటు స్టార్ క్యాంపెయినర్లను అభ్యర్థులు కోరుతున్నారు. అయినా అక్కడి నుంచి సానుకూల స్పందన రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం గ్రేటర్ హైదరాబాద్‌కే కిషన్‌రెడ్డి పరిమితమై ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు.. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.
'కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రులే - వారివి మాత్రం ఆరు గ్యారెంటీలట'
అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లిన కిషన్ రెడ్డి.. నామినేషన్ల ఉపసంహరణ తరువాత మిన్నకుండిపోయారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తారని భావిస్తే.. ఇప్పటి వరకు జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లలేదు. రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్‌కే పరిమితమవ్వడం పట్ల సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.
BJP National Leaders Campaigning in Telangana :అగ్రనేతలు జేపీ నడ్డా,అమిత్ షా(Amit Shah), పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు మాత్రం.. అభ్యర్థుల తరఫున ప్రచార సభలో పాల్గొని వెళ్తున్నారు. కానీ ఈ సభలు ప్రజలను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. అగ్రనేతలు హిందీలో ప్రసంగించడం వల్ల గ్రామీణ ప్రజలకు అర్థంకాకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ (CM KCR), కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మాతృభాషలో ప్రసంగిస్తూ స్థానిక ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం.. సుడిగాలి పర్యటన చేస్తూ రోజుకు మూడు, నాలుగు సభలకు హాజరవుతున్నారు. సభకు వచ్చే ప్రజలను తన మాటలతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఇది గుర్తెరుగక జాతీయ నాయకులను ప్రచారానికి రప్పిస్తోంది. అగ్రనేతలతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధర్ రావు, బండి సంజయ్(Bandi Sanjay), ఈటల రాజేందర్ ప్రచారం చేస్తే ఎంతోకొంత లాభం చేకూరుతుంది.
'బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు - కాంగ్రెస్ ఫేక్ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు'