BJP Bus Yatra Plan in Telangana : గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పట్టణానికే పరిమితమైన పార్టీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లగలిగారు. అందుకు నిదర్శనమే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీవినీ ఎరగని రీతిలో సత్తా చాటింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేననే వాదన బలంగా వెళ్లింది.
BJP Bus Tour Way in Telangana : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అంటే తెలియని ఊర్లో ప్రజా సంగ్రామ యాత్రతో కమిటీలు ఏర్పడిన పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న కాషాయ దండుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతరువాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా పార్టీలో జోష్ తగ్గింది. పలువురు బహిరంగంగానే జాతీయ నాయకత్వాన్ని విమర్శించిన పరిస్థితి. అధిష్ఠానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరకి వస్తున్నందున.. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోంది.
BJP Bus Tour Divided to 3 Cluster : ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్ర చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. యాత్రకు సంబంధించి పార్టీ రాష్ట్ర ఇంచార్జీ, ఎన్నికల కమిటీ సహా ఇంచార్జీ సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణ బాధ్యత వహించిన వీరేందర్ గౌడ్, దీపక్ రెడ్డి, పాపారావు, విక్రమ్ గౌడ్లకు బస్సు యాత్ర నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టింది. మూడు క్లస్టర్లలో ప్రారంభమయ్యే యాత్రను దీపక్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించింది.