Opposition Parties Focus on Jupalli and Ponguleti: రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగనున్న నేపథ్యంలోనే చేరికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఊమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటినుంచి రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
పొంగులేటితో కలిసి లోక్‌సభ సభ్యులుగా వ్యవహరించిన కొందరు బీజీపీ నేతలు ఈ అంశంలో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటిని బీజేపీలోకి తీసుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించడంతో పాటు నేరుగా పొంగులేటితో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ బుధవారం రోజున దిల్లీకి చేరుకున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలతో పొంగులేటి అంశంపై బండి సంజయ్ చర్చించినట్లు సమాచారం. పొంగులేటిని పార్టీలోకి తీసుకువచ్చే అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర ముఖ్యనేతలకు సూచించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ ముఖ్యనేత ఒకరు స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాల్లో టాక్. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరితే వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశం ఉంటుందని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.