భాజపా కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ కార్యకర్త శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు వెల్లడించారు. చికిత్స పొందుతున్న గంగుల శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై భాజపా ప్రతినిధుల బృందం వైద్యులనడిగి తెలుసుకుంది. శ్రీనివాస్ బలిదానానికి సిద్ధమయ్యడంటే తెరాస ప్రభుత్వ వైఖరే కారణమని ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు.
ప్రాణాపాయ స్థితిలో శ్రీనివాస్: భాజపా నేతలు - భాజపా కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వార్తలు
ఇటీవల భాజపా కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కార్యకర్త శ్రీనివాస్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. శ్రీనివాస్ ఆరోగ్యాన్ని కాపాడాలని వైద్యులను కోరినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు తెలిపారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితిపై భాజపా ప్రతినిధుల బృందం వైద్యులను అడిగి తెలుసుకుంది.
బండి సంజయ్, భాజపా కార్యకర్తలపై కేసీఆర్ దాడి చేయించడం పట్ల మానసిక వేదనకు గురై శ్రీనివాస్ ఆత్మాహుతికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాలరాస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరిస్తామని తెలిపారు. తన ఆత్మాహుతి ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అనుకున్నాడని మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. శ్రీనివాస్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద వన్ ప్లస్ స్టోర్.. కేటీఆర్ ట్వీట్