కొవిడ్ నేపథ్యంలో దృశ్యమాధ్యమంలో నిర్వహించిన బయో ఆసియా సదస్సు విజయవంతమైందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న 18వ బయో ఆసియా సదస్సుకు ఈసారి 72 దేశాల నుంచి 31,450 మంది ప్రతినిధులు కనెక్ట్ అయ్యారని వెల్లడించారు.
వర్చువల్ కంఫర్ట్‌తో ఈ సంఖ్య క్రితంసారి కన్నా అత్యధికమని జయేశ్ అన్నారు. హెల్త్ క్రైసిస్ సమయంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ సదస్సుకు లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలు, పరిశ్రమ వర్గాల డిమాండ్లపై ప్రతినిధులు లోతైన అర్థవంతమైన చర్చలు జరిపారని జయేశ్ పేర్కొన్నారు.
ఎఫ్ఏబీఏ అవార్డు...
డాక్టర్ బజాజ్ జ్ఞాపకార్థం ఈసారి బీఎస్ బజాజ్ మెమోరియల్ ఎఫ్ఏబీఏ అవార్డును ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ బలరాం భార్గవకు ఇస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. కొవిడ్ మహమ్మారి నివారణకు వ్యాక్సిన్‌తో అడ్డుకట్ట వేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు మొదటి రోజు జీనోం వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించినట్లు పేర్కొన్నారు.
రెండోరోజు సదస్సులో...
రెండో రోజు సదస్సులో ప్రదానంగా మెడికల్ డివైసెస్ తయారీ, ఎగుమతుల్లో భారత్ పాత్ర, ఆర్ అండ్ డీ సెంటర్ల విస్తరణలో రాయితీలు, ప్రోత్సాహకాల పాత్ర, వ్యాక్సిన్లు, డ్రగ్‌లు మానవ వినియోగానికి వేగంగా అందేందుకు తీసుకోవాల్సిన రెగ్యూలేటరీ అనుమతులపై ప్రభుత్వ, ప్రైవేట్ ప్లేయర్లు విస్తృతంగా చర్చించారు. కొవిడ్ చూపిన మార్గంతో 2022 ఫిబ్రవరిలో జరిగే బయో ఆసియా సదస్సును ఇన్‌పర్సన్‌గా నిర్వహించినా.. అందులో కొన్ని సెషన్లు వర్చువల్ ప్లాట్ ఫాం ద్వారా కొనసాగిస్తామని జయేశ్ ప్రకటించారు.
ఇదీ చూడండి:భాజపాలో చేరగానే పునీతులవుతున్నారా?: పొన్నం