Bio Asia Summit 2024 in Hyderabad : డేటా, కృతిమ మేధ ద్వారా అవకాశాలను పునర్నిర్వచించడం అన్న థీమ్ ఆధారంగా.. తదుపరి బయో ఆసియా సదస్సు జరగనుంది. హైదరాబాద్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు.. బయో ఆసియా 21వ ఎడిషన్ జరగనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి 2024 సదస్సు తేదీలు, థీమ్‌ను మంత్రి ఇవాళ విడుదల చేశారు. డేటా, కృతిమ మేధను సమ్మిళితం చేస్తూ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో అవకాశాలను పునర్నిర్వచించేందుకు ఒక అసాధారణ వేదిక అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Bio Asia 21st Edition Date and Theme : ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల భవిష్యత్‌లో.. ఈ సదస్సు కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో డిజిటల్ ఆవిష్కరణల ప్రభావం పెరుగుతున్న తరుణంలో.. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీని అనుసంధానించడం ద్వారా ఆపార సామర్థ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. జీవశాస్త్రంతో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌తో డేటాసైన్స్ అనుసంధానమయ్యే నగరం హైదరాబాద్ అని కేటీఆర్ వివరించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని లైఫ్ సైన్సెస్ రంగంతో జోడించడంలో.. హైదరాబాద్ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్‌కు ఈ సమ్మేళనం.. మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. 2024 బయో ఆసియా సదస్సుకు 50 దేశాలకు పైగా ప్రపంచ నాయకులు.. పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు హాజరవుతారని కేటీఆర్ వివరించారు.