దక్షిణాదిలో పెట్టుబడులకు హైదరాబాద్ సౌత్‌గేట్‌వేగా నిలుస్తోందని బిహార్ పరిశ్రమల శాఖామంత్రి షానవాజ్ హుస్సేన్ కితాబిచ్చారు. రాష్ట్రంతో పాటు.. బిహార్ సైతం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అక్కడ పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో షానవాజ్ హుస్సేన్ పాల్గొన్నారు. రెండురాష్ట్రాలు టెక్స్‌టైల్, ఆహారశుద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని వివరించారు.
BIHAR MINISTER:'దక్షిణాదిలో పెట్టుబడులకు గేట్‌వేగా హైదరాబాద్' - బీహార్ మంత్రి
తెలంగాణతో పాటు.. బిహార్ సైతం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తమ రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి షానవాజ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు దక్షిణాదిలో హైదరాబాద్ సౌత్ గేట్ వేగా నిలుస్తోందని కితాబిచ్చారు. ఎఫ్‌టీసీసీఐ(FTCCI) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
బిహార్‌ను చూసే దృష్టి కోణం మార్చమని చెప్పేందుకే వచ్చా. ఇప్పటివరకు మీరు వ్యతిరేక దృక్పథంతోనే చూస్తున్నారు. రోడ్డు మధ్యలో గడ్డి, మొక్కలు మొలకెత్తినంత మాత్రాన.. వాహనాలు అటూ ఇటూ తిరిగితే అక్కడే రహదారి ఏర్పడుతుంది. ఎవరైనా చెబుతూ ఉంటే వాటిపై మనకు సానుకూల దృష్టి ఏర్పడుతుంది. గుజరాత్ విషయంలో అదే జరిగింది. బిహార్ విషయంలోనూ మీ దృక్పథాన్ని మార్చుకొని రాష్ట్రానికి వస్తారని ఆశిస్తున్నా.- షానవాజ్ హుస్సేన్, బిహార్ పరిశ్రమల శాఖ మంత్రి
బిహార్ అనేక రంగాల్లో పురోగమిస్తోందని షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇథనాల్ పాలసీతో 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిన బిహార్.. టెక్స్ టైల్ పాలసీ, ఫార్మా పాలసీలను తీసుకొస్తోందని.. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు పలు రకాల రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలను విమానాశ్రయం నుంచే పరిశ్రమల మంత్రిగా సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించారు.