దిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ నగర శివారు మేడిపల్లి, ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు. 1500 పరిశ్రమలు ఒకే చోటికి తరలించడం వల్ల వెలువడే కాలుష్యం భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దగ్గరలోని చెరువులు, అటవీ ప్రాంతం, భూమి, నీరు, గాలి అన్ని కలుషితమవుతాయని... ఈ పరిశ్రమల ప్రభావం వంద కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పేద రైతుల వద్ద పంటలు పండే భూమిని ఎకరా ఎనిమిది లక్షలకు బలవంతంగా లాక్కుని... అదే భూమిని ఎకరా కోటిన్నర రూపాయలకు పరిశ్రమలకు కేటాయిస్తుందని ఆరోపించారు.