Bhogi celebrations in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇళ్ల ముందు విభిన్న రంగులతో రంగవల్లులు వేస్తూ చిన్నా పెద్దా సందడి చేశారు. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలతో వేసే భోగి మంటలతో.. బద్ధకంతో పాటు మదిలోని నిరాశానిస్పృహలనూ వదిలిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలతో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక.. మొదటి సంక్రాంతి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని చెప్పారు. హైదరాబాద్లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి.. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామని వివరించారు.
"తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా రూపొందిన తర్వాత సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నాను. భోగి పండుగ రోజు ప్రతికూల ఆలోచనలను తొలగించుకొని దేశం కోసం, సమాజం కోసం పాటుపడే విధంగా నడుం బిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను."- కవిత, ఎమ్మెల్సీ