తెలంగాణ

telangana

ETV Bharat / state

వాడవాడన అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబురాలు

ఊరూరా బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగుతుండగా... ఇంటింటా పూల పండుగతో పరవశించి పోతున్నారు. ఆడపడుచులందరూ.. బతుకమ్మ ఆటలో సందడి చేస్తున్నారు. ఏడో రోజు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను... మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రాజ్​భవన్​తో సహా.. పలు జిల్లాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించారు.

వాడవాడన అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబురాలు
వాడవాడన అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 23, 2020, 5:36 AM IST

వాడవాడన అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబురాలు

రాజ్​భవన్​లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళసై సంబురాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలని గవర్నర్​ సూచించారు. తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, డిచ్‌పల్లి, కుర్నాపల్లిలో మహిళలు వేడుకల్లో సందడి చేశారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.... ప్రధాన కూడళ్లలో ఆడిపాడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మహిళలు... చిన్న బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తంగేడు, గునుక పూలతో పేర్చిన బతుకమ్మల వద్ద చిన్న పెద్దా తేడా లేకుండా ఆనందంగా గడిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ సద్దుల బతుకమ్మ నిర్వహించారు. మూలవాగు తీరంలోని బతుకమ్మ తెప్ప వద్ద ఏర్పాటు చేసిన మైదానంలో.... మహిళలు, యువతులు పాటలు పాడుతూ సందడిగా గడిపారు. కరీంనగర్‌ శివారు బొమ్మకల్‌‌లో సద్దుల బతుకమ్మ అట్టహాసంగా నిర్వహించారు. గ్రామంలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ. ఆ ఊరి మహిళలు అత్తారింట్లో ఏడురోజుల సద్దుల బతుకమ్మ జరుపుకుని... పుట్టినింట్లో 9 రోజులకు జరుపుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేటజిల్లా హుస్నాబాద్‌లో బతుకమ్మల చుట్టూ కోలాటం ఆడుతూ మహిళలు సందడి చేశారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి వేడుకలు జరుపుకున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో... మహిళలు ఆడిపాడారు. సిద్దిపేట కోమటిచెరువు ఆడిటోరియం ఆవరణలో బతుకమ్మ వేడుకలను సీపీ జోయల్‌ డేవిస్ ప్రారంభించారు. సీపీ సతీమణి కోలాటం ఆడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో.. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గ్రామ కూడళ్లలో సంబురాలు జరుపుకున్నారు. యాదాద్రి జిల్లా గుండాలలో... బతుకమ్మలను దేవుళ్ల బండమీదికి తీసుకొచ్చి సంబురాలు చేసుకున్నారు.

ఇదీ చూడండి:కాస్త దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details