శాసనసభలో రాష్ట్ర సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రానికి రెండు కళ్ల లాంటివని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP leader Bhatti Vikramarka) శాసనసభలో (assembly sessions 2021 ) పేర్కొన్నారు. మన రాష్ట్రం ధనిక రాష్ట్రమే.. ముఖ్యమంత్రే చాలా సార్లు చెప్పారని స్పష్టం చేశారు. భూములు లేనివారు, పరిశ్రమల్లో పనిచేసే వారంతా ఉన్నతంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంచార జాతులను ఆదుకోవాలని కోరారు. సంచార జాతుల వారికి మంచి పౌష్టికాహారం అందించాలని సూచించారు. సంచార జాతుల గురించి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. భిక్షాటన చేసుకునే వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
డయాలసిస్ రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. సఫాయి కార్మికులు, బండలు కొట్టే వాళ్ల జీతాలు పెంచాలని చెప్పారు. అందరికి నాణ్యమైన విద్య, వైద్యం అందించినప్పుడే నిజమైన సంక్షేమం సాధించినట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానాలు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదని.. ఇప్పుడైనా కొన్ని మండలాల్లో ప్రారంభించాలని సూచించారు. అలా ప్రారంభిస్తే.. భవిష్యత్లో వచ్చే ప్రభుత్వాలు సైతం వాటిని కొనసాగిస్తాయని అన్నారు. 57 సంవత్సరాలకే పింఛను ఇస్తామని చెప్పారు.. కానీ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదని ఉద్ఘాటించారు. ఒంటరి మహిళలు చాలా మంది పెన్షన్ కోసం.. దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. వారికి పెన్షన్ అందటం లేదని వివరించారు. వాటిని క్లియర్ చేయాలని కోరారు.