తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ బడ్జెట్ మేడిపండు, అంకెల గారడీలాగా ఉంది: భట్టి

Telangana Budget 2023: రాష్ట్ర బడ్జెట్​పై కాంగ్రెస్​ నాయకులు భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, జీవన్​రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ మాదిరిగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపిస్తే.. గత బడ్జెట్ గుర్తుకు వచ్చిందని జీవన్​రెడ్డి విమర్శించారు. బడ్జెట్ పూర్తయిన అనంతరం శాసనసభ బయట వీరు మీడియాతో మాట్లాడారు.

clp leader batti
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

By

Published : Feb 6, 2023, 7:28 PM IST

Bhatti Vikramarka Criticized The Telangana Budget: శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు, అంకెల గారడీ మాదిరిగా ఉందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్​ను ఘనంగా ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. మరి వ్యవసాయానికి ఐదు గంటలు కూడా కరెంట్ రావడం లేదని.. దానికి పట్టించుకుంటారా అని నిలదీశారు.

గత ఎనిమిదేళ్లుగా ఈ సబ్​ ప్లాన్ నిధులను సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. పాత పింఛన్​ ఇవ్వాలని ఉద్యోగులు కోరుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ ఊసే బడ్జెట్​ ప్రసంగంలో లేదన్నారు.

16లక్షల మంది రైతుల ఖాతాలు ఎన్​పీఏగా మారాయి.. ఇవి ఇలా మారడం వల్ల రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేని పరిస్థితి ఎదురైందని విమర్శించారు. ఇలా చేయడం వల్ల రైతులు బయటకు పోయి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. మరి గిరిజన బంధును ఎందుకు బడ్జెట్​లో ప్రస్తావన లేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా గాలికి వదిలేశారని తీవ్రస్థాయిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

ప్రజలను మోసం చేయడానికే ఈ బడ్జెట్: కేంద్రంతో విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు అయితే.. మరి బడ్జెట్​లో రూ.41వేల కోట్లు కేంద్ర గ్రాంట్స్​ ద్వారా వస్తాయని ఎలా చెప్పుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. గత బడ్జెట్​లో కేటాయించిన నిధులను ఎంతవరకు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికి.. ఎన్నికల కోసమే ఈ అంకెల గారడీ భారీ బడ్జెట్ అని దుయ్యబట్టారు.

గత బడ్జెట్​ను చూసినట్లు ఉంది: ఈ బడ్జెట్​ను చూస్తే.. గత బడ్జెట్‌ను మరోసారి ప్రవేశపెట్టినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారు.. రుణమాఫీ చేయకపోతే రైతులను ఓట్లు అడిగే హక్కు బీఆర్​ఎస్​ సర్కారుకు లేదని విమర్శించారు. దళిత బంధు, గృహ నిర్మాణ శాఖకు సరిగా నిధులు కేటాయించలేదని ఆరోపణలు చేశారు. ప్రతి నియోజకవర్గంలోని 1500మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు.

"ఈ బడ్జెట్​లో బాగా అభివృద్ధి చెందింది ఏంటంటే లిక్కర్​కు సంబంధించిన ఆదాయం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మిగిలిన అంశాల్లో పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. బీసీ బంధు లేక బీసీ యాక్షన్​ గురించి చెప్పలేదు. సంక్షేమ రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. రెసిడెన్సియల్​ స్కూల్​లకు సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించలేదు." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

బడ్జెట్ తరువాత మీడియాతో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details