Bhatti Comments on YS Sharmila Joining Congress : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడం సంతోషకరంగా ఉందని.. వైఎస్ కుటుంబమంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. వారు భావోద్వేగాల వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంతకాలం దూరమయ్యారని తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(Peoples March Padayatra) బృందం సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. భట్టి విక్రమార్క ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
Bhatti Vikramarka on YS Sharmila : ఇప్పుడు తిరిగి వైఎస్ షర్మిల సొంతింటికి వస్తున్నట్లు భావిస్తున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హర్షించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీకు బీ టీం లాంటి పార్టీ అని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో చీలికలు తీసుకొచ్చి.. బీజేపీకి ఉపయోగపడేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రానికి బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేమీ లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఇప్పటికే భట్టి మార్గంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో కలుస్తానంటే స్వాగతిస్తానంటూ ఆహ్వానించారు.
షర్మిల చేరికపై వ్యతిరేక గళం : కానీ కాంగ్రెస్‌లోనే మరో వర్గానికి చెందిన నాయకులు మాత్రం వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకుంటే చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యమ సమయంలో ఆమె సమైక్యాంధ్ర గళం వినిపించి.. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టాను అంటున్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరితే కచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బలం ఇచ్చిన వారం అవుతామని భావిస్తున్నారు. వైఎస్ షర్మిల పార్టీలో చేరితే పాలేరు నియోజకవర్గం టికెట్ ఇవ్వాలి.. ఇప్పుడు అదే నియోజకవర్గంలోని బలమైన నాయకుడు తుమ్మల నాగేశ్వర్రావు పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఆ టికెట్ ఆయనకు ఇవ్వడానికి పార్టీ సుముఖంగా ఉంది. అందుకని ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోకుండా ఉంటేనే మంచిదని ఆ వర్గం భావిస్తోంది.