తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న సీఎం కేసీఆర్... ఎన్ని ఉద్యోగాలిచ్చారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి... 50వేల ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలకు వర్చువల్ వేదికగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భూమి పూజ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.
కేసీఆర్ నిద్రపోతున్నారు...
సుమారు రూ.45 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకోవడం కోసమే రూ.85 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లుగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదన్నారు. కొవిడ్ పరీక్షల నిర్వహణలో తెలంగాణ వెనుకబడిపోయిందని నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు.
కార్యకర్తలు కష్టపడితే అధికారంలోకి రావొచ్చు...
లోక్సభ ఎన్నికల మాదిరిగానే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అనుకూలత భాజపాకు ఉందని నడ్డా అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేస్తే అధికారంలోకి రావొచ్చునని స్పష్టం చేశారు.