తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువలా భారతమాత మహాహారతి - హైదరాబాద్​లో మహాహారతి కార్యక్రమం

నెక్లెస్​రోడ్​లో నిర్వహించిన 'భారతమాత మహాహారతి' కన్నుల పండువగా జరిగింది. భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం.. ఈసారి మూడవ హారతి ఇచ్చుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, అతిరథమహారథుల సంభాషణలతో మారుమోగింది. ఈ సందర్భంగా నిర్వహించిన భరతమాత మహాహారతి ఆహుతులను కట్టిపడేసింది.

maha harathi
కన్నుల పండువలా భారతమాత మహాహారతి

By

Published : Jan 27, 2020, 4:23 AM IST

Updated : Jan 27, 2020, 6:19 AM IST

కన్నుల పండువలా భారతమాత మహాహారతి

హైదరాబాద్ నెక్లెస్​రోడ్డులో నిర్వహించిన భారతమాత మహా హారతి ప్రేక్షకులను కట్టిపడేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భారతమాత ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషన్​రెడ్డి 2018 నుంచి గణతంత్ర దినోత్సవంనాడు భారతమాత హారతిని నిర్వహిస్తున్నారు. ఆదివారం రిపబ్లిక్​డే సందర్భంగా మూడోసారి భారతమాత మహా హారతి ఘనంగా నిర్వహించారు.

మూడు వేలకు మందికి పైగా భారతమాత వేషధారణలో

కార్యక్రమానికి విద్యార్థులు, కళాకారులు, అతిరథ మహారథులు, నగరవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 3,326 మంది బాలికలు భారతమాత వేషధారణలో ఓకేసారి వేదికపై కనిపించి కనువిందు చేశారు. ఒకే వేదికపై ఈ ఘనత అందుకున్న బృందంగా వీరికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులు ప్రకటిస్తూ.. ఫౌండేషన్ సభ్యులకు అవార్డులు అందజేశారు.

ఆద్యంతం అలరించిన సాస్కృతిక కార్యక్రమాలు

కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు.. గవర్నర్ తమిళిసై, భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, పండితులు గరికపాటి నరసింహరావు, హీరో రాజ్ తరుణ్, భాజపా శ్రేణులు హాజరయ్యారు. కార్యక్రమం సాంతం నగరంలోని పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తిని చాటే గేయాలకు నృత్య ప్రదర్శనలతో ఆహుతులను కట్టిపడేశాయి.

దైవభక్తి కంటే... దేశ భక్తి గొప్పది

ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా మనం సంబురాలు జరుపుకుంటున్నామని గవర్నర్ గుర్తు చేశారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న కిషన్ రెడ్డి చొరవను అభినందిస్తూ.. దేశం గర్వపడేలా పాటు పడాలని పౌరులకు గవర్నర్ పిలుపునిచ్చారు. దేశభక్తిని పెంపొందించే ఇటువంటి కార్యక్రాన్ని నిరాటంకంగా కొనసాగిస్తానని.. ఈ సప్త హారతి, మహా హారతిలాగే మన దేశం దేదీప్యమానంగా ప్రపంచ పటాన వెలుగులీనుతుందని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చా

రాజకీయాల్లోకి సేవ చేయాలనే వచ్చాను తప్ప.. పదవులను ఆశించి కాదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. దేశానికి సేవ చేయాలనే భావంతోనే భాజపాతో కలిసానని ఆయన తెలిపారు. మోదీ లాంటి బలమైన నాయకత్వం దేశానికి అవసరమని పవన్‌కల్యాణ్‌ అన్నారు. దైవభక్తి కంటే.. దేశభక్తి గొప్పదని.. అటువంటి దేశభక్తి కలిగిన కేంద్రప్రభుత్వం సీఏఏను తీసుకొచ్చిందని పండితులు గరికపాటి అన్నారు. కార్యక్రమం చివరలో నిర్వహించిన సప్త హారతి కార్యక్రమం.. దానిని వివరిస్తూ చేసిన వ్యాఖ్యానం సందర్శకులను కట్టిపడేసింది.

ఇదీ చూడండి: మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్

Last Updated : Jan 27, 2020, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details