BRS Party Emergence : కేసీఆర్ సంతకం.. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం
08:43 December 09
కేసీఆర్ సంతకం.. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం
BRS Party Formation : దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్‌కు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు.