రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఓ ట్వీట్‌పై భారత్ బయోటెక్ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్ల స్పందించారు. గవర్నర్ సూచించిన ముగ్గురు ఆడ పిల్లల విద్యకు సహకారం అందించడంతో పాటు జీనోమ్ వ్యాలీలోని తమ సంస్థలోనే అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సుచిత్ర ఎల్ల స్పందించడంపై సంతోషం వ్యక్తం చేసిన గవర్నర్.. సుచిత్ర ఎల్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆ ముగ్గురు పిల్లల వివరాలను గవర్నర్ కార్యాలయం నుంచి పంపిస్తామని రీ ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
అసలు విషయం ఏంటంటే..: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లిలో పర్యటించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో చేర్యాల వద్ద ఓ మహిళ గవర్నర్ కాన్వాయ్‌కు చేయి అడ్డుపెట్టింది. గమనించిన గవర్నర్ తమిళిసై.. కారును రోడ్డు పక్కన ఆపి ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆడ పిల్లలతో కలిసి శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటున్నామని బాధిత మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది. నిరుపేద జీవితం గడుపుతున్న తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో గవర్నర్ ఆమె ఇంటిని సందర్శించారు. బాధిత కుటుంబానికి రాజ్‌భవన్ నుంచి తన సహకారాన్ని అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. ఈ మేరకు తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. గవర్నర్ చేసిన ఈ ట్వీట్‌పై స్పందించిన భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల.. ఆ ముగ్గురు ఆడ పిల్లలను చదివించేందుకు ముందుకొచ్చారు.