తెలంగాణ

telangana

ETV Bharat / state

Teachers Day: పాఠశాలలకే వన్నె తెచ్చిన గురువులు.. వినూత్న ఆలోచనలతో బోధన - తెలంగాణ వార్తలు

బడి అంటే వారికి గుడితో సమానం. ఉద్యోగ జీవితంలో ఎన్ని ప్రాంతాలకు మారినా.. పాఠశాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడిని తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను పోటీ పరీక్షల్లోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ వనరులు వినియోగించుకుంటూ ఒకరు.. బడిలో విద్యార్థుల సంఖ్య పెంచడంలో మరొకరు.. నిరుద్యోగులకు కెరీర్‌ సలహాలు ఇవ్వడంలో ఇంకొకరు.. బోధనతో ‘పాట’వాన్ని ప్రదర్శిస్తూ వేరొకరు.. ఇలా నగరానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం(Teachers day) సందర్భంగా గురువులపై ప్రత్యేక కథనం...

Teachers Day 2021, best teachers
పాఠశాలలకే వన్నె తెచ్చిన గురువులు, ఉపాధ్యాయ దినోత్సవం

By

Published : Sep 5, 2021, 10:32 AM IST

గురుశిష్యుల బంధం అమోఘం. తల్లిదండ్రులు జన్మనిస్తే... ఆ జన్మను సార్థకం చేసేది గురువులు. అందుకే గురువుకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఎంతోమంది ఉపాధ్యాయులు తమ బోధనతో చిన్నారుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నేడు గురుపూజోత్సవం(teachers day) సందర్భంగా కొందరు ఉపాధ్యాయుల గురించి తెలుసుకుందాం.

బోధనలో కృషి అనంతం

కరోనా(corona) సమయంలో పిల్లలు చదువుకు దూరమయ్యారు. కొండాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పల్లె అనంతరెడ్డి కృషితో అక్కడి విద్యార్థులు పాఠాలు నేర్చుకున్నారు. ప్రభుత్వంతోపాటు దాతల సహకారంతో నూతన భవన నిర్మాణానికి కృషి చేశారు. పాఠ్య పుస్తకాలు, విద్యా సామగ్రి ఇప్పిస్తున్నారు. గతేడాది జూన్‌ నుంచే విద్యార్థులకు వాట్సాప్‌లలో డిజిటల్‌ పాఠ్యపుస్తకాలు పంపి చదివించారు. వీడియో పాఠాలు పోస్ట్‌ చేసి నేర్పించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా జూమ్‌ తరగతులు ప్రారంభించారు. దాతల సాయంతో టీవీలు, చరవాణులు ఇప్పించారు. పేదలకు రూ.16 లక్షలతో నిత్యావసరాలు అందజేశారు.

పాఠశాలకు వెళ్లారంటే.. విద్యార్థుల సంఖ్య పెరిగినట్టే!

ఆయన ఏ పాఠశాలకు వచ్చినా ఆ స్కూలు రూపురేఖలే మారిపోతాయి. ఆయనే మల్కాజిగిరికి చెందిన చిన్నాబత్తిన శౌరి. ఓల్డ్‌నల్లగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. 2018లో ఆయన వచ్చినప్పుడు 68 మంది విద్యార్థులున్నారు. మంచుకొండ ఫౌండేషన్‌ సాయంతో 5 డిజిటల్‌ తరగతులు, వెట్‌బోర్డులు, స్పీకర్లు, గోడలపై చిత్తరువులు వేయించారు. ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభించారు. ‘ముందు వచ్చి పాఠశాల చూడండి.. తర్వాతే చేర్పించండి’ అనే నినాదం ఎత్తుకున్నారు. స్పందన లభించి.. ఇప్పుడు ఏకంగా 650 మందికి పిల్లలు పెరగడం విశేషం.

నిరుద్యోగులకు మార్గదర్శి

మూసాపేట జిల్లా పరిషత్‌(బాలుర) ఉన్నత పాఠశాలలో పనిచేసే ఎండీ యాసిన్‌ జాబ్‌ గైడ్‌ పేరిట నిరుద్యోగులకు సమాచారం అందిస్తున్నారు. ఉదయాన్నే ఏడు రకాల దినపత్రికల్లో సమాచారం సేకరించి.. వెబ్‌సైట్ల నుంచి సమాచారం తీసుకుని వాట్సాప్‌ గ్రూపుల్లో వెయ్యి మంది నిరుద్యోగులకు పంపుతారు. యూట్యూబ్‌లో జాబ్‌గైడ్‌ ఇన్‌ తెలుగు పేరిట ప్రత్యేక ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు పోటీ పరీక్షల ఫీజుల చెల్లింపునకు విద్యానిధి ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో పేద విద్యార్థులకు దాతల సహకారంతో టీవీలు, చరవాణులు అందజేశారు.


ఆయన సహకారం.. విద్యార్థులకు ‘ఉపకారం’

‘‘నేను ప్రభుత్వ అలియా పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు సీబీఎస్‌ఈ పాఠశాలలో చదివే విద్యార్థిని మా స్కూల్‌లో చేర్పించవచ్చా అని అతని తండ్రి అడిగాడు. వెంటనే చేర్పించాలని చెప్పా. నా గైడెన్స్‌తో చదివిన ఆ విద్యార్థి కోల్‌కతా ఐఐఎంలో చదువుతున్నాడు’’ అంటున్నారు కాచిగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం.వెంకరమణ. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయి పరీక్షల్లో విజయం సాధించి ఉపకారవేతనాలు సాధించేలా చేయడంలో కీలకభూమిక పోషిస్తున్నారు.


సు‘గీతం’.. పాటం.. గుర్తుండేలా

ఆడుతూ.. పాడుతూ.. బోధించడం ఎప్పటికీ విద్యార్థుల మెదడులో గుర్తుండిపోతుంది. ఆ కోవలోకే వస్తారు నల్లకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయిని సత్రశాల సుగీత. విద్యార్థులతో కలిసి ఆడుతూ పాడుతూ సులువుగా అర్థమయ్యేలా బోధిస్తారు. కరోనా సమయంలోనూ వీడియోకాలింగ్‌ ద్వారా బోధించారు. పాటలంటే ఎంతో ఆసక్తి. ఆంగ్లంలోనూ పాటలు పాడిస్తూ విద్యార్థులకు పాఠ్యాంశాలు వివరిస్తుంటారు. కరోనా జాగ్రత్తల కోసం ప్రత్యేకంగా పాటల పెరడీ చేసి విద్యార్థులకు వివరించేవారు.


ఉత్తమ బోధనతో అవార్డులు..

బంజారాహిల్స్‌కు చెందిన డా.అనుపమ కోనేరు సుల్తాన్‌ ఉల్‌ఉలూమ్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. 2015లో పీహెచ్‌డీ చేశారు. ఫార్మా రంగంలో కళాశాలకు పలు అవార్డులు రావడంలో కృషి చేశారు. కరోనా నేపథ్యంలో 2020లో కళాశాల విద్యార్థులతో శానిటైజర్‌ తయారు చేయించారు. 2016లో మణిపాల్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ టీచర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఆప్టి) దేశవ్యాప్తంగా ఫార్మసీ రంగంలోని 50 మంది ఉత్తమ అధ్యాపకులకు అందించిన అవార్డును అందుకున్నారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అనూరాధ

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలోని సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయ ఇంగ్లిష్‌ అధ్యాపకురాలు వి.అనూరాధ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు- 2021గా ఎంపికయ్యారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆంగ్ల బోధనతో పాటు పలు పుస్తకాలనూ రచించారు. పీజీ డైరెక్టర్‌గా, విభాగాధిపతిగా సేవలందించారు. ప్రస్తుతం ఉస్మానియా గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ ఎం.సి. సభ్యురాలు. ఆమెను కళాశాల ఛైర్మన్‌ ఆదిత్యమార్గం, కార్యదర్శి వినయ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శోభన తోటి అధ్యాపకులు అభినందించారు.

అక్షరాభివృద్ధికి పట్టం

చింతల్‌లోని భగత్‌సింగ్‌నగర్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారి(ఎంఈవో) ఆంజనేయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్‌ సంస్థలతో మాట్లాడి మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. కరోనా నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో బల్దియా, ఇతర శాఖల సహకారంతో పనులు వేగంగా పూర్తిచేయించారు.

ప్రభుత్వ గుర్తింపు తండ్రికి అంకితం

ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన తండ్రి స్ఫూర్తితో ఉత్తమ ప్రభుత్వ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్కల అధ్యాపకులు మారం విజయ్‌ శేఖర్‌. అవార్డును తండ్రి నరహరికి అంకితమిచ్చారు. కొవిడ్‌తో సమయంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బేసిక్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ తయారీకి ఇంటర్‌ బోర్డు ముందుకొచ్చింది. గణితం విభాగానికి సంబంధించిన అధ్యాపకుల్లో విజయ్‌శేఖర్‌ ప్రముఖంగా పని చేశారు. విద్యాబోధనను వీడియో తీసి ప్రసారం చేశారు. క్లిష్ట సమయంలో విద్యార్థులకు తోడ్పాటునందించారు.

దాతృత్వాన్ని చాటిన పంతులమ్మ
యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయిని పొట్లూరి అనూరాధ కొవిడ్‌ సమయంలో నిరుపేద విద్యార్థులకు సొంత ఖర్చుతో స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. 9, 10వ తరగతి విద్యార్థులలో ఆరుగురికి చరవాణులు అందజేశారు. కరోనా సమయంలో తన కుమారుడి పెళ్లి నిరాడంబరంగా జరగడంతో మిగిలిన మొత్తం దీనికి వెచ్చించానన్నారు.

160 పరిశోధన పత్రాలు..

సీహెచ్‌.వెంకటరమణరెడ్డి 2010 జులై నుంచి జేఎన్‌టీయూహెచ్‌లో రసాయనశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సీబీఐటీ కళాశాల, ఆంధ్రా వర్సిటీలో పనిచేశారు. ఆయన రాసిన 160 పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. పర్యవేక్షణలో 21మంది పీహెచ్‌డీ పూర్తిచేశారు. అమెరికన్‌ కెమికల్‌, ఇండియన్‌ కెమికల్‌ సొసైటీల్లో సభ్యుడిగా ఉన్నారు. ఇంజినీరింగ్‌ కెమిస్ట్రీలో రెండు పుస్తకాలు రాశారు. రసాయనశాస్త్రంలో బోధన, పరిశోధనలో ఈయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

సివిల్‌ విభాగంలో సేవలకు గుర్తింపుగా

జేఎన్‌టీయూహెచ్‌ సివిల్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.మంజలవాణి ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. 1988లో విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె తర్వాత ఆర్‌అండ్‌బిలో అసిస్టెంట్‌ ఈఈగా పనిచేస్తూ 1994లో జేఎన్‌టీయూహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. 2009లో ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు అందుకున్నారు. 2006లో సివిల్‌ విభాగంలో మొదటి అధ్యాపకురాలిగా పురస్కారం తీసుకున్నారు. బోధన, పరిశోధనలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

ఇదీ చదవండి:RAINS: వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు.. గర్భిణీ అవస్థలు

ABOUT THE AUTHOR

...view details