Fake Charities Begging Mafia Arrest in Hyderabad : ప్రార్ధించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న, మీ పుట్టిన రోజు, పెళ్లి రోజున అనాథలకు సాయం చేయండి. వారికి ఒక రోజు అన్నం పెట్టి కడుపు నింపండి. ఇలాంటి సందేశాలతో ఉన్న స్టీల్ బాక్సులతో నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద సాయం చేయమని కొందరు యువతులు అడగటం చూస్తుంటాం. కానీ ఈ బెగ్గింగ్ దందా వెనుక ఉన్న కేటుగాళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. ఈ నేరగాళ్లు నగరంలోని శివారు ప్రాంతాల్లో 90లక్షలు విలుచేసే భూములు కొనుగోలు చేశారు.
ఇటీవల నగరంలో హిజ్రాలతో, చిన్నారులతో, మహిళల చేత భిక్షాటన(Beggars in Hyderabad) చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సేవ పేరుతో జరుగుతున్న బెగ్గింగ్ మాఫియా ముఠా పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ ఆర్మూర్‌కి చెందిన గడ్డి గణేష్ ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో అమ్మ చేయూత ఫౌండేషన్ పేరుతో 2019 లో ఓ సేవా సంస్థను ప్రారంభించాడు.
Hyderabad Taskforce Arrests Begging Racket :అనాథలకు సహయం చేస్తామని చేప్పి పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని చెప్పి.. ఆ ఫౌండేషన్ పేరుతో పలువురు నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఇతనికి 2020లో నల్గొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు కేతావత్ రవి, కేతావత్ మంగు.. నగరంలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఫౌండేషన్ పేరుతో బాక్సులు తయారు చేయించిస్తామని ఇందుకు ఒక్కో బాక్సుకు నెలకు 2వేలు ఇస్తామని తెలిపారు.
రవి, మంగు వారి ఇళ్ల సమీపంలో ఉన్న నిరుద్యోగ యువతులను రిక్రూట్ చేసుకున్నారు. వారిని నగరంలోని ప్రధాన కూడళ్ల వద్దకు నిందితులు వారి అటోలో తీసుకుని వెళ్తారు. ఈ యువతులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ ప్రజల వద్ద సాయం చేయమంటూ వేడుకుంటారు. తర్వాత బాక్సులో ఏ రోజు వచ్చిన డబ్బు ఆరోజు వారి ప్రాంతానికి వెళ్లి తాళాలు తీసి ఇద్దరు అన్నదమ్ములు సగం, బిక్షాటన చేసిన వారికి సగం తీసుకుంటున్నారు.