ప్రధానంగా 5 ప్రభుత్వ దవాఖానాల్లో 3737 పడకలు కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేశారు. 1308 పడకల్లో రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మిగిలినవన్నీ ఖాళీనే. గ్రేటర్ మూడు జిల్లాల రోగులతోపాటు ఇతర జిల్లాల నుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి చికిత్సకు పొందడానికి మక్కువ చూపిస్తున్నారు. రోజూ కనీసం 1400 మందికి వైద్యం అందించాల్సిన పరిస్థితి. ఆర్థిక తోడ్పాటులేని వేలాదిమంది ముందుగా పరుగులు తీసేది గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ ఆసుపత్రులకే.
గాంధీ: ఇక్కడ 790 మంది కరోనా రోగులు ఉన్నారు. మరో 1100 మందికి చికిత్స అందించేందుకు వీలుగా పడకలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవారిలో దాదాపు 500 మంది తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఉన్నారు. చాలామంది వెంటిలేటర్‌పై ఉండటంతో వైద్యులు వారిపైనే దృష్టిసారించారు. పెద్ద సంఖ్యలో రోగులను చేర్చుకుంటే విషమంగా ఉన్నవారిపై దృష్టిసారించలేమన్న ఉద్దేశంతో.. వందలమంది వస్తున్నా సరే ఔషధాలిచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండాలంటూ పంపేస్తున్నారు. ఇలా తిరిగి వెళ్లినవారిలో పలువురికి రెండు రోజులకే ఆరోగ్యం విషమించి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.
ఫీవర్ ఆసుపత్రి: ఇక్కడ 100 పడకలుంటే వైద్యం పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 13 మంది. అనేకమంది చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నా పడకలు లభించడం లేదు.