తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana: అందుబాటులోకి సాధారణ, ఆక్సిజన్‌ పడకలు

కరోనా బాధితులకు ఊపిరి పీల్చుకొనే కబురిది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో క్రమేపీ పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. మే 15 వరకు నగరంలోని ఆసుపత్రుల్లో పడకల కావాలంటే చాలా కష్టమయ్యేది. తప్పక ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయి మరణించిన వారు ఎందరో. ఇప్పుడు సాధారణ, ఆక్సిజన్‌ పడకల లభ్యత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఐసీయూ పడకలకు మాత్రం అదే డిమాండ్‌ ఉందని స్పష్టం చేశారు. అయితే కొంత సమయం తరవాత అవీ కేటాయిస్తున్నామని సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

beds-and-oxygen-beds-are-available-in-government-and-private-hospitals-in-telangana
Telangana: అందుబాటులోకి సాధారణ, ఆక్సిజన్‌ పడకలు

By

Published : May 27, 2021, 8:56 AM IST

ఫలితం ఇచ్చిన.. పరిణామాలివే

లాక్‌డౌన్‌:రాష్ట్రంలో ఈనెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో పాటు అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేశారు. అత్యవసరమైన వారిని మినహాయించి, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. రోడ్లపై రద్దీ తగ్గిపోవడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని నిపుణులు చెబుతున్నారు.

పడకల పెంపు:గాంధీ ఆసుపత్రిలో 1850 పడకలుంటే అదనంగా మరో 200 ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న బెడ్లను ఏర్పాటు చేశారు. వంద మందికి పైగా కోలుకొని రోజూ ఇళ్లకు వెళుతున్నారు. 20 రోజుల కిందట ఆరేడు గంటలు అంబులెన్సులోనే వేచిఉండాల్సి వచ్చేంది. ప్రస్తుతం అరగంటలోనే చేర్చుకుంటున్నారు. టిమ్స్‌, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లోనూ ఖాళీలున్నాయి. బాధితుల రాక గతం కంటే చాలావరకు తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.

గాంధీ ఆసుపత్రిలో పది రోజుల క్రితం పడక దొరకాలంటే గగనమయ్యేది. అంబులెన్సుల్లోనే ప్రాణాలొదిలిన వారున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్‌, సాధారణ పడకలను అరగంటలోనే కేటాయిస్తున్నారు. అయితే ఐసీయూలో మాత్రం ఖాళీల్లేవు. ఉన్న 650 నిండిపోయాయి. పది రోజుల క్రితం వరకు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పడక కోసం 30-40 మంది నిరీక్షించేవారు. నిత్యం 200 ఫోన్‌కాల్స్‌ వచ్చేవి. ఇప్పుడు పడకల కోసం ఫోన్‌ చేసే వారు 20 శాతం మేర తగ్గారని వైద్యులు తెలిపారు.

దూరా‘భారం’ కావడం:లాక్‌డౌన్‌కు ముందు ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని జిల్లాల నుంచి పెద్దఎత్తున బాధితులు అంబులెన్సుల్లో వచ్చేవారు. ప్రధానంగా రెండు కారణాల వల్ల కొద్ది రోజులుగా ఈ సంఖ్య తగ్గిపోయింది. లాక్‌డౌన్‌తో అంబులెన్సుల నిర్వాహకులు ధరలు భారీగా పెంచేయడం. భరించలేని చాలామంది దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేరడం. చాలా ప్రాంతాల్లో వైరస్‌ తగ్గుముఖం పట్టడం. ప్రజల్లో అవగాహన స్థాయి పెరిగి, లక్షణాలు కన్పించిన మొదటి రోజు నుంచే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడడం.

చిన్న ఆసుపత్రుల నుంచి పెద్దవాటికి

  • పది రోజుల క్రితం వరకు 10-20 పడకలు గల చిన్న ఆసుపత్రులూ బాధితులతో నిండిపోయాయి. ఆక్సిజన్‌ అవసరమైన వారికి కాన్సన్‌ట్రేటర్లతో చికిత్స అందించగా, చాలామంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. కొందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారి పెద్ద ఆసుపత్రులకు వెళుతున్నారు. అందుకే ఐసీయూల్లో ఖాళీలుండడంలేదు.
  • అమీర్‌పేట నేచర్‌క్యూర్‌ ఆసుపత్రిలో వారం క్రితం వరకు 170 మంది ఐసొలేషన్‌లో ఉండగా, ఇప్పుడు 70కు తగ్గింది. కరోనా పాజిటివిటీ ఏప్రిల్‌ నెల, మే రెండో వారం వరకు 50 శాతం వరకు నమోదైంది. రెండు రోజుల నుంచి 16 శాతానికి పరిమితమైందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవాని తెలిపారు.

స్టెరాయిడ్లు వాడుతున్నారా?

ఇంట్లో ఉండే కరోనా బాధితులు స్టెరాయిడ్లు వాడుతుంటే తరచూ మధుమేహం స్థాయి పరిశీలించుకోవాలి. స్టెరాయిడ్లు వాడేవారిలో షుగర్‌ పెరుగుతుంది.. నియంత్రించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బ్లాక్‌ఫంగస్‌ సోకే ప్రమాదం ఉంది. ముందే వైద్యులను సంప్రదించడం వల్ల సులువుగా బయట పడవచ్చని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:kcr: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details