తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ! - కొడవీడు కోట అభివృద్ధి

తెలుగువారి పౌరుషానికి ప్రతీక కొండవీడు కోట. ఒకప్పటి రాజుల దర్పానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ చారిత్రక కట్టడం..ఇప్పుడు కొత్తరూపు సంతరించుకుంటోంది. పర్యటక ప్రాంతంగా యాత్రికులను ఆకర్షిస్తోంది.

కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ!

By

Published : Oct 15, 2019, 6:48 AM IST


తెలుగునేలపై కొండవీడు కోటకు ప్రత్యేక స్థానముంది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో 700 అడుగుల ఎత్తున... కొండపై ఈ దుర్గం నిర్మితమైంది. శత్రువుల నుంచి రక్షణ కోసం అప్పటి రెడ్డిరాజులు.. 80 కి పైగా కట్టడాలు నిర్మించారు. వీటిలో అతిపెద్దది ఏపీలోని కొండవీడుకోట. రాతిగోడ, కోట బురుజులు, ఆలయాలు, అద్భుత శిల్పాలు ఈ కోటకున్న ప్రాధాన్యతను ఇనుమడింపజేస్తున్నాయి. కొండ కింద ఉన్న కత్తులబావిది చరిత్రలో ప్రత్యేక స్థానమే. శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను జయించేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కొండవీడుకోట.. రాష్ట్ర విభజన తర్వాత నుంచి కొత్తరూపు సంతరించుకుంటోంది.

తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన కొండవీడుకోట అభివృద్ధి కోసం 2010 లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ 2014 నుంచి పనుల్లో పురోగతి సాధ్యమైంది. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో... కార్లు, వాహనాలు కొండపైకి వెళ్తున్నాయి. దుర్గంలో ఇటీవల జీర్ణోద్ధరణ చేసిన లక్ష్మీ నరసింహ ఆలయం పర్యటకులను ఆకర్షిస్తోంది.

అరుదైన వృక్ష జాతులు.. ఔషధ మొక్కలు

కొండవీడు కోటపై చారిత్రక నిర్మాణాలే కాదు.... అరుదైన వృక్షజాతులున్నాయి. పుస్తకాల్లోనే చూసే ఈ ఔషధ మొక్కలను పరిశీలించేందుకు, పరిశోధించేందుకు విద్యార్థులు తరలివస్తున్నారు. ఇన్నాళ్లూ కొండవీడు నుంచి మెట్ల ద్వారా మాత్రమే కొండపైకి వెళ్లే అవకాశముండేది. ప్రస్తుతం ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత తేలికైంది.

అభివృద్ధి పనులపై త్వరలో నిర్ణయం!

కొండపైన పిల్లల పార్కు, భోజనశాల, బోటు ఏర్పాటు వంటివి ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఇటీవల కోటను సందర్శించిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.... ప్రసిద్ధ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ప్రాథమికంగా కల్పించాల్సిన సదుపాయాలు, అభివృద్ధి పనులపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది.

కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ!

ABOUT THE AUTHOR

...view details