రాష్ట్రంలో కరోనాతో మృతి చెందుతున్న వారి లెక్కలు ప్రభుత్వం కావాలనే తక్కువగా చూపుతోందని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్‌రావు సవాల్ విసిరారు. తాను వెల్లడించిన వివరాల్లో తప్పులుంటే జైలుకు వెల్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. జులై 16, 17 తేదీల్లో గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన వారి వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లను బేరీజు వేస్తూ వెంకట్ వివరించారు. ఆ రెండు రోజుల్లో వైరస్ మహమ్మారితో చనిపోయిన రోగుల వివరాలు, ప్రభుత్వం ప్రకటించిన వివరాలకు పొంతనే లేదన్నారు.
మంత్రి ఈటల సమాధానం చెప్పాలి...
జులై 16న రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది కొవిడ్‌తో చనిపోయిన్నట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసిందని... ఆ ఒక్క రోజే గాంధీలో 14 మంది చనిపోయారని వెల్లడించారు. జులై 17న ప్రభుత్వం చెప్పిన మరణాల సంఖ్య 7 ఉండగా... ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 10 మంది మరణించినట్లు వివరాలను బహిర్గతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎంత మంది చనిపోతున్నారో లెక్క పత్రం లేదని కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయన్నారు. ఈ అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని వెంకట్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్