నగరంలో శునకాలు, పిల్లులు, పావురాలు, ఉడతలు, చిలుకలు తదితర పెంపుడు జంతువులను ఎక్కువగా పెంచుతున్నారు. నగరంలో 50 వేలకు పైగా పెంపుడు జంతువులున్నట్లు అంచనా. కుక్కలు, పిల్లులకు సాధారణ స్థాయి చప్పుళ్ల కన్నా తక్కువ శబ్దాలను సైతం గ్రహించే సామర్థ్యం ఉంటుంది. రాత్రుళ్లు వాటి వినికిడి సామర్థ్యం మరింత ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఆ సమయంలో ఏ చిన్న అలికిడి అయినా, ఇట్టే పసిగట్టి స్పందిస్తాయి. దీపావళి టపాసుల పేలుళ్లకు పెంపుడు జంతువులకు కర్ణభేరి సమస్యలు రావడం, కొన్నిసార్లు పగిలిపోవడం వంటివి సంభవిస్తాయంటున్నారు పశువైద్య నిపుణులు. వాటి మెదడులో అసమతుల్యత ఏర్పడి అటూ ఇటూ తచ్చాడటం, కట్టేసుంటే గొలుసును లాగడం, పెద్దగా మొరగడం చేస్తాయి. గర్భస్రావమూ అయ్యే ప్రమాదం ఉంది. పక్షులు పగలంతా సంచరించి, రాత్రుళ్లు గూటికి చేరతాయి. టపాసుల పేలుళ్ల చప్పుళ్లకు వీటికి నిద్రాభంగం అవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శబ్దాలకు భయంతో మంచాలు, సోఫాల కిందకు దూరినప్పుడు కొద్దిసేపు వదిలేయాలి. తక్కువ శబ్దం విన్పించే గదిలో వాటిని ఉంచాలి. తలుపులు, కిటికీలు మూసేయాలి.