తెలంగాణ

telangana

ETV Bharat / state

Mental Health Care: నాకెవరూ ప్రపోజ్‌ చేయలేదు - ప్రేమ

Mental Health Care: నేను స్కూలూ కాలేజీల్లో టాపర్‌ని. అందువల్ల నన్నంతా గౌరవిస్తారే తప్ప ఎవరూ ప్రపోజ్‌ చేయలేదు. నాలుగేళ్ల క్రితం ఎమ్‌ఎన్‌సిలో చేరాను. కానీ అక్కడ చాలా మంది ఎఫైర్స్‌ పెట్టుకోవడం నచ్చలేదు. ఇమడలేక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తే మా ఊళ్లోనే వచ్చింది. కానీ మావాళ్లు సాఫ్ట్‌వేర్‌ సంబంధాలు వస్తున్నాయి, మళ్లీ సాఫ్ట్‌వేర్‌లోకి మారమంటున్నారు. నా జీతం కంటే వాళ్ల సంపాదనే అధికంగా ఉంది. నేను ఇందులోకి మారడం పొరపాటా అనిపిస్తోంది. కానీ ఇంట్లో ఒత్తిడి ఎక్కువై, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఏ సోదరి మానసిక నిపుణురాలిని అడుగుతోంది? ఈ ప్రశ్నలకు ఆమె చెప్పే సమాధానం చూద్దామా?

love
ప్రేమ

By

Published : Oct 31, 2022, 1:28 PM IST

Mental Health Care: మార్కులెక్కువ రావడం, అందరూ గౌరవించడం, మిమ్మల్ని మీరు నైతికంగా ఉన్నతంగా భావించడం వల్ల మామూలుగా అందరి జీవితాల్లో సంభవించే ప్రేమ లాంటి విషయాలను ఒప్పుకోలేకపోయారు. జీతం ఎక్కువైనా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఇమడలేక వచ్చేశారు. ఆ ఆందోళన, ఒత్తిడి లేకుండా ఈ ఉద్యోగంలో బానే ఉంటున్నారు. వీటిని బట్టి మీది ముందే అభిప్రాయాలు ఏర్పరచుకునే తత్వమని అర్థమవుతోంది.

దీన్నే మేకింగ్‌ జడ్జిమెంట్‌ అంటారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో మీరు చూసిన కొందరికి అఫైర్స్‌ ఉన్నాయని ఇక అందరూ అలాగే ఉంటారని నిర్ధారించుకున్నారు. నిజానికి అందరూ అలానే ఉండరు. అలాంటి అనుమానం ఉంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో మాట్లాడి అతడి విషయాలను గమనించాలి. మరో ముఖ్య విషయం... ఏదన్నా అయిపోయిన తర్వాత ఇలా చేయకపోతే బాగుండేదేమో అని పశ్చాత్తాపం చెందడం సరికాదు.

ముందు మీ మనసును అడిగి మీకేం కావాలో తేల్చుకోండి. ఎప్పుడూ తొందరపడి నిర్ణయానికి రావొద్దు. చిన్న ఉద్యోగమైనా అనుమానాలూ భయాలూ లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి ఆలోచించండి. లేదూ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదు, ఒక అవకాశం ఇవ్వాలనుకుంటే అతనితో మాట్లాడి మీ ఆలోచనలన్నీ చెప్పండి. అపోహలను తొలగించుకోండి. అతని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అతని నైజం మీరు భయపడుతున్న తరహాదే అనిపిస్తే అటువైపు వెళ్లొద్దు. ముందే అన్నీ ఆలోచించండి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక సందేహాలూ, బాధపడటాలూ కూడదని మానసిక నిపుణురాలు డా. మండాది గౌరీదేవి వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details