రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్.. బలహీన వర్గాలపై అణచివేత చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలున్న ప్రజాప్రతినిధులందరిపై వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు.
ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం భావ్యం కాదన్నారు జాజుల. కేబినెట్ విస్తరణ సమయంలో మార్పులు చేయాల్సిన అవసరముందన్నారు. తెరాస వల్లే నేతల్లో గుర్తింపు వచ్చిందనే భ్రమను వీడి.. ఓట్లతో పదవులు వచ్చాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. జనగామ కలెక్టర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూమి కబ్జా చేశారని తేలినా.. వారిపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.