హైదరాబాద్ నాచారంలోని ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని.. బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) సందర్శించారు. బీసీల సాధికారతకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే అన్ని రంగాల్లో రాణించవచ్చునని చెప్పారు. ఆ దిశగా బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలి
దళితుల సాధికారత ప్రత్యేక పథకం.. ప్రవేశపెట్టి నిరుపేద ఎస్సీలకు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్... ఆ విధంగానే నిరుపేద బీసీలు కూడా బీసీ సాధికారత పథకం ప్రవేశపెట్టి ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలోని బీసీ కులాల 12 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చి ఛైర్మన్లను, పాలకమండలి సభ్యులను నియమించి, బడ్జెట్ కేటాయించాలన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.