అన్యాయంగా బీసీ జాబితా నుంచి తొలిగించిన 26 కులాలను వెంటనే చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ తొలిగించారని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సి భవన్లో బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఖరితో బీసీ కులాల ప్రజలు ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, పోటీ పరీక్షలలో సీట్లు కోల్పోయారని అన్నారు. సీఎం తనవైఖరిని మార్చుకోకపోతే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. వారిని జాబితాలో చేర్చకపోతే పది లక్షల మందితో ప్రగతిభవన్ గోడ బద్దలు కొడతామని హెచ్చరించారు.
తొలిగించిన బీసీ వర్గాలను జాబితాలో చేర్చాలి : ఆర్.క్రిష్ణయ్య
హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సి భవన్లో బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే జాబితాలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలో ఏ రంగంలోనూ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి విమర్శించారు.
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయం : తల్లోజు ఆచారి
రాష్ట్రంలో ఫైళ్లు కదలాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు . ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో బీసీ జాబితాలోని 26 కులాలను తొలిగించారన్నారు. ఏడేళ్లుగా ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే బీసీ కమిషన్ నివేదిక కోరాలని... కేసీఆర్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఏ కులానికి ఓటు బ్యాంకు అధికంగా ఉంటే ... ఆ కులాన్ని బీసీ జాబితాల్లో చేర్చుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రంగంలో కూడా 27 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగే సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే నెల 6న దిల్లీలో జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులతో సమావేశమై 26 కులాలను జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు.