తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలో మెుదలయ్యాయి. ఊరూ.. వాడా.. పల్లె.. పట్నం తేడా లేకుండా తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి ఆడిపాడుతున్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒక్కచోట చేరి సందడి చేస్తున్నారు. సంవత్సరమంతా ఈ పండుగ కోసమే ఆడబిడ్డలు ఎదురుచూస్తారు. పుట్టింట్లో కొందరు.. అత్తారింట్లో మరికొందరు.. ఎవరి వీలును బట్టి వారు ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కష్టం, సుఖం, భక్తి, భయం, ప్రేమ, బంధుత్వం, చరిత్ర, పురాణాలు కలగలిపి పాడే పాటలు.. ఈ పండుగ రోజుల్లో వీధి వీధినా మార్మోగుతాయి.
రాష్ట్రంలో సందడిగా మొదలైన బతుకమ్మ వేడుకలు
ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగే కాదు.. పూలతో మాత్రమే జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి.. చిన్నారులు, యువతులు, మహిళలు ఒక్క చోట చేరి ఆడతారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ ఉత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకలో పల్లె, పట్నం అని తేడాలేకుండా చిన్నారులు, యువతులు ఆడిపాడారు.
రాష్ట్రంలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు
ప్రస్తుతం కరోనా వైరస్.. పండుగ సందడిని కాస్త తగ్గించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరి భారీగా జనం గుమికూడరాదన్న నియమాలతో.. జాగ్రత్తలు పాటిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఓ వైపు కరోనా, మరోవైపు వరదల వల్ల తొలిరోజు బతుకమ్మ సంబురాల సందడి కాస్త తగ్గింది. రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్