తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2021, 10:55 PM IST

Updated : Oct 24, 2021, 2:55 AM IST

ETV Bharat / state

Bathukamma on Burj Khalifa: విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పూలసంబురం.. బుర్జ్​ ఖలీఫాపై తెలంగాణం

ఎడారి దేశంలో తంగేడువనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక వైభవం ఖండాంతరాలను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా సౌధం తెరపై బతుకమ్మ ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి పూలపండగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

bathukamma-song-video-on-burj-khalifa-in-dubai
bathukamma-song-video-on-burj-khalifa-in-dubai

విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పూల సంబురం.. బుర్జ్​ ఖలీఫాపై ప్రదర్శన

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బతుకమ్మ పండుగ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. బతుకమ్మ వైభవం దుబాయ్‌లో కనుల విందు చేసింది. విశ్వవేదికపై పూలపండుగ వైభవాన్ని ప్రదర్శించారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ(Bathukamma on Burj Khalifa) వీడియో ప్రదర్శన కనుల విందుగా జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు, మళ్లీ 10.40 గంటలకు రెండు దఫాలుగా 3నిమిషాల నిడివి గల వీడియోను బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించగా... ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు.

పొంగిన భావోద్వేగాలు..

తెలంగాణ పటం, సీఎం కేసీఆర్‌ చిత్రపటం, జైహింద్‌, జై తెలంగాణ, జై కేసీఆర్‌ అనే నినాదాలను సైతం ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు భావోద్వేగాలకు గురయ్యారు. జై తెలంగాణ, జై కేసీఆర్‌ నినాదాలతో సంబురాలు చేసుకున్నారు.

కేరింతలు కొట్టిన కవిత..

బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, విశిష్ఠత, సంబురాల సంస్కృతిని తెలిపేలా వీడియో రూపొందించి ఎంతో గొప్పగా ప్రదర్శించారు. ఈ వేడుకను దుబాయ్​లో జనాలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తిలకించారు. వీడియో ప్రదర్శించినంత సేపు ఎమ్మెల్సీ కవిత.. సంతోషంతో కేరింతలు కొట్టారు. వీడియోను చూస్తూ.. చిన్నపిల్లగా మారి ఆనందంతో కేకలు వేశారు. బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం అవుతున్న క్షణాలను కవిత పూర్తిగా ఆస్వాధించారు. బుర్జ్​ఖలీఫాపై తన తండ్రి సీఎం కేసీఆర్​ ఫొటో రాగానే.. అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం.. పలువురు ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి బుర్జ్‌ ఖలీఫా వద్ద కవిత బతుకమ్మ ఆడారు.

చరిత్రలో నిలిచిపోతుంది: కవిత

బతుకమ్మను బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించడం తెలంగాణతో పాటు దేశానికి సైతం గర్వకారణమని కవిత పేర్కొన్నారు. బతుకమ్మ ప్రస్థానంలో ఇదొక చారిత్రక ఘట్టమని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించదగిన విషయమని అన్నారు. దీనికి సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబురాలు మిన్నుమట్టాయి..

"తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండగను గత పుష్కర కాలంగా ఏటా దేశవిదేశాల్లో పెద్ద ఎత్తున జరుపుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ జాగృతిని ప్రారంభించి.. బతుకమ్మ పండగ ద్వారా ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేశాం. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు బుర్జ్‌ ఖలీఫాను ఎంచుకున్నాం. ఇకపై ఏటా సరికొత్తగా బతుకమ్మ పండగ నిర్వహిస్తాం. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతంలో, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది చిత్రీకరించిన బతుకమ్మ పాట అందరినీ అలరించింది. దాన్ని ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంతో సంబురాలు మిన్నుముట్టాయి" -కవిత, ఎమ్మెల్సీ

నేరుగా వీక్షించిన ప్రజాప్రతినిధులు..

ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్‌, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్‌, సంజయ్‌, బిగాల గణేశ్‌ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌ సాగర్‌, దాస్యం విజయ్‌ భాస్కర్‌ తదితరులు తెలంగాణ నుంచి హాజరయ్యారు. అంతకుముందు కవితకు దుబాయ్‌ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసులు ఘనస్వాగతం పలికారు. బతుకమ్మ సంబురాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆమె చేస్తున్న కృషిని అభినందించారు.

ఇదీ చదవండి: BATHUKAMMA ON BURJ KHALIFA: బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ పాటకు పట్టాభిషేకం.. కనులవిందుగా ప్రదర్శన

Last Updated : Oct 24, 2021, 2:55 AM IST

ABOUT THE AUTHOR

...view details