Bathukamma Festival 2023Starts Today: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ..! పూలనే పూజించే విశిష్ఠమైన పండుగ..! నేటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు.. తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. తీరొక్క పూలతో అందంగా ఏర్చి కూర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలు ఆడిపాడనున్నారు. ఊరూవాడ తీరొక్క పూలవనంగా మారనుంది.
దేవునికి పూలను పెట్టి పూజిస్తాం. కానీ పూలనే పూజించే విశిష్ఠమైన సంప్రదాయం బతుకమ్మ..! ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పర్వదినం. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పల్లె, పట్నం విరుల వనంగా మారనుంది.
Bathukamma Celebrations In Telangana 2023: తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో.. బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మ పేర్చడంలో మహిళలు పోటీలు పడతారు. సాయంత్రం గుడివద్దకో..ఇంటి ముంగిట్లోనో, కూడళ్లలో వద్దకో వెళ్లి.. బతుకమ్మలనంతా ఒక్క చోటకు చేర్చి.. ఉయ్యాల పాటలతో ఆడిపాడుతారు.
బతుకమ్మ ఆట పాటలుఊరూ వాడా మారుమోగుతాయి. పల్లే.. పట్టణం అన్న తేడా లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆరుపదులు దాటిన మహిళలు సైతం చిన్నపిల్లలుగా మారి వేడుకల్లో పాల్గొంటారు. ప్రకృతితో పెనవేసుకున్న.. బతుకమ్మ.. బతుకమ్మ... ఉయ్యాలో అంటూ సాగే పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.