Bathukamma Celebrations in Uganda: ఉగాండా రాజధాని కంపాలాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాండా ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు.
రెండు గంటల పాటు ఈ వేడుకలు కొనసాగాయి. అనంతరం బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనులో వేసిన మహిళలు.. పోయిరా బతుకమ్మ మళ్లీ రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. ఈ బతుకమ్మ సంబురాలను, తెలంగాణ సంస్కృతిని చూసి అక్కడి వారు హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు జరిగే సంబురాలలో తామూ పాల్గొంటామని తెలిపారు.