తెలంగాణ సోదరిగా, ఆడబిడ్డగా రాజ్‌భవన్‌లో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా రాజ్‌భవన్ మహిళా ఉద్యోగులు, కుటుంబాలకు చెందిన మహిళలకు గవర్నర్ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవనంలో ఒక భాగమైన ప్రత్యేక పండుగ అన్న తమిళిసై... ఆడ బిడ్డల పండగ, ప్రకృతి, దైవం, పుట్టిన గడ్డతో మమేకమయ్యే విశిష్ఠమైన సందర్భమని వివరించారు.
బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరం, బలవర్ధకమైనవన్న గవర్నర్... మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతుందని ఒక వైద్యురాలిగా తాను గమనించానని అన్నారు. బతుకమ్మను పేర్చేందుకు ఉపయోగించే పూలలో కూడా ఔషధ గుణాలుంటాయని... వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందని తెలిపారు.