Baswapur Project Compensation Delay :కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన నృసింహ సాగర్ - బస్వాపూర్ రిజర్వాయర్ ఇప్పటికీ పూర్తి స్థాయి వినియోగంలోకి రాలేదు. తీవ్ర వర్షాభావ, కరవు పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో 0.8 టీఎంసీల నీటి సామర్థ్యంతో 2009లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అంకురార్పణ చేసింది. 650 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించాలని ప్రభుత్వం యోచించి చర్యలు చేపట్టింది. అప్పట్లో చిన్న ప్రాజెక్టు ఏర్పాటు చేసినా, తక్కువ భూములే పోయినా రైతులు పెద్దగా భారం అనుకోలేదు. పైగా కొత్త ప్రాజెక్టు వచ్చింది కదా అని సంతోషపడ్డారు.
KTR Tweet: కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్రం సాయంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
"ప్రాజెక్ట్ భూసేకరణ కోసం 2013లో ఎకరానికి రూ.వేలల్లో ఇచ్చారు. అదే భూమి ప్రస్తుతం రూ.కోటి 50 లక్షల ధర పలుకుతుంది. నాలుగు ఎకరాలకు అప్పుడు రూ.12 లక్షలు వచ్చింది. వేరే చోట భూమి, డబుల్ బెడ్రూం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదు. భూములిచ్చి నాతో పాటు ఊరు మొత్తం ఆగం అయ్యాం. ప్రాజెక్టు నుంచి నీరు లీకేజీ అవుతుంది. మరమ్మతులు చేసినా నీటి వృథా అవుతూనే ఉంది."- ఉడత పోశయ్య, బాధిత రైతు
Nrisimhasagar - Baswapur Reservoir In Yadadri Bhuvanagiri : కానీ పరిణామ క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత భూసేకరణ చేసి కొందరికి పరిహారం ఇవ్వగా, మరికొందరికి పరిహారం అందించకపోవడం, పునరావాసం కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బాధిత రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నృసింహసాగర్ - బస్వాపూర్రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూములకు జూన్ నెలాఖరులోగా పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసే విధంగా ప్రభుత్వాల తీరు ఉందంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది మే 5వ తేదీన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ ప్రక్రియ మొదలు కాకపోవడంతో బాధిత రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది.
బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల నిరసన