Sankranthi celebrations: వారు ఖాకీ వేసిన.. లాఠీ పట్టిన దొంగలకు దడ. నిత్యం ఖాకీ బట్టలతో తీరిక సమయం లేకుండా గడిపే పోలీసులకు పండుగ నాడు కూడా పనే ఉంటుంది. వారికీ తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకుని ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ అందుకు వారికి సమయం దొరకకా అటువంటి ఆనందాలను మిస్ అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో ఖాకీలు మాత్రం సంక్రాంతి ముందస్తూ సంబరాలు జరుపుకుని వారి కుటుంబాలతో ఆనందంగా గడిపారు.
చాలా వరకు సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. అయితే ఎక్కువ శాతం మంది ఆ మూడు రోజులే పండుగ జరుపుకుంటారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా ముందస్తు వేడుకలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు సైతం పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలు, కార్యాలయాలు, ఇలా ఎక్కడ చూసిన ముందస్తు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇంతమంది ముందుగానే సంబరాలు జరుపుకుంటుంటే మేము మాత్రం ఏం తక్కువ అంటూ పోలీసులు కూడా కదం తొక్కారు.
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.. చిన్నా, పెద్దా అందరూ కలిసి మూడు రోజులు జరుపుకునే సంబరం. సంక్రాంతి సంబరాలతో పల్లెల్లోనే కాదు పట్టణాలు సైతం పండుగ శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడూ కఠినంగా తమ విధులు నిర్వహించే ఖాకీలు సంప్రదాయ దుస్తులు ధరించి ముందస్తు సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.