Crop Loans Issues: యాసంగి సీజన్‌లో ఇప్పటికే మూడు నెలలు గడచిపోయాయి. పంటరుణాల పంపిణీ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే 15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ నెలాఖరుతో విత్తనాలు, నాట్లు వేయడం పూర్తవుతుందని అంచనా. ప్రభుత్వం రైతుబంధు కింద సాయం చేసినా బ్యాంకులేమో పంట రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.వందకు రూ.2-5 దాకా వడ్డీ చెల్లించేలా ఒప్పంద పత్రాలు రాసి భూములను తాకట్టు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే ప్రైవేటు వ్యాపారులు రైతులకు రుణాలిస్తున్నట్లు ‘తెలంగాణ రాష్ట్ర ఉపశమన కమిషన్’ అధ్యయనంలో తేలింది.
ఈ సీజన్‌లో రూ.27వేల కోట్లను పంటరుణాలుగా ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించింది. రుణాలను వేగంగా ఇస్తే సాగు పెట్టుబడులకు రైతులకు ఉపకరిస్తాయని తెలిపింది. క్షేత్రస్థాయిలో బ్యాంకులు సవాలక్ష కొర్రీలతో పంటరుణాలను సక్రమంగా ఇవ్వడం లేదు. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ 3 నెలల కాలం పంటసీజన్ పూర్తయినా రూ.9వేల కోట్ల వరకే ఇచ్చినట్లు అంచనా.
భూమి అమ్ముతున్నారని:పంటరుణం తీసుకునే రైతుల నుంచి రూ.లక్షన్నర వరకూ పూచీకత్తు అడగరాదని రిజర్వుబ్యాంకు గతంలో బ్యాంకులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పలు బ్యాంకులు దీన్ని అమలుచేయడం లేదు. రైతు నుంచి పట్టాదారు పాసుపుస్తకం తీసుకున్నాకే పంటరుణం ఇస్తున్నాయి. దీనికితోడు ధరణి పోర్టల్‌లో రైతు రెవెన్యూ ఖాతాను తెరిచి పంటరుణం ఇచ్చినట్లు నమోదు చేసి అకౌంట్‌ను స్తంభింప(ఫ్రీజ్) చేస్తున్నాయి.
అప్పుల పంపిణీ ఆలస్యం:ఆపై రుణం తీసుకున్న భూమిని ఎవరికీ అమ్మకూడదని స్పష్టం చేస్తున్నాయి. పంటరుణం తీసుకున్నాక ఇలా ఫ్రీజ్ చేసే అవకాశం ధరణిలో తమకు రావడం లేదంటూ కొన్ని బ్యాంకులు అప్పుల పంపిణీ ఆలస్యం చేస్తున్నాయి. ధరణి పోర్టల్‌ను తాము వినియోగించుకుని పంటరుణం ఇచ్చాక.. రైతు భూమి రెవెన్యూఖాతాను ఫ్రీజ్ చేసే సదుపాయం కల్పించాలని బ్యాంకర్లు రాష్ట్ర రెవెన్యూశాఖను కోరారు.
కొందరు రైతులు గతంలో పంటరుణం తీసుకున్నప్పుడు చూపిన భూమి విస్తీర్ణంకన్నా ధరణి పోర్టల్‌లో తక్కువగా కనిపిస్తోందని, వివరాలు సరిగా లేవని రుణాలివ్వకుండా తిరస్కరిస్తున్నారు. ఉదాహరణకు మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఒక బ్యాంకులో వెయ్యిమంది రైతులకు పంటరుణ ఖాతాలుంటే 150 మందికే ఈ యాసంగిలో రుణాలిచ్చినట్లు సిబ్బంది ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. పాత రుణం చెల్లించి రెన్యువల్ చేసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదని, రుణమాఫీ చేసేదాకా వచ్చేది లేదని చెపుతున్నారని ఆయన వివరించారు.