నిధులివ్వని బ్యాంకులు... ప్రశ్నార్థకంగా మారిన ఐదు ప్రాజెక్టుల పరిస్థితి - Telangana Government loans latest news
NO LOANS FOR IRRIGATION PROJECTS రోజుకో మెలికపెడుతూ, ఒప్పందంప్రకారం రుణాలివ్వకుండా బ్యాంకులు సతాయిస్తున్నాయి. అవసరమైన మొత్తం రాష్ట్ర ఖజానానుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈతరుణంలో జలవనరుల అభివృద్ధికార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని పనులు కొనసాగిస్తోన్న ఐదు ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది.
నిధులివ్వని బ్యాంకులు... ప్రశ్నార్ధకంగా మారిన ఐదు ప్రాజెక్టుల పరిస్థితి
By
Published : Sep 10, 2022, 9:16 AM IST
|
Updated : Sep 10, 2022, 10:05 AM IST
NO LOANS FOR IRRIGATION PROJECTS రోజుకో మెలిక పెడుతూ, ఒప్పందం ప్రకారం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. అవసరమైన మొత్తం రాష్ట్ర ఖజానా నుంచి విడుదలయ్యే పరిస్థితీ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని పనులు కొనసాగిస్తోన్న ఐదు ప్రాజెక్టులను.. తాజా లక్ష్యం మేరకు కూడా గడువులోగా పూర్తిచేయడం కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. ఇందులో సమ్మక్కసాగర్ బ్యారేజీ దాదాపు పూర్తయినందున దీనిని మినహాయిస్తే, మిగిలిన ప్రాజెక్టుల పూర్తికి సకాలంలో నిధులు సమకూర్చడం సమస్యగా మారే అవకాశం ఉంది. భూసేకరణతో పాటు గుత్తేదారులకు బిల్లులు చెల్లించడంలో జరిగిన జాప్యం ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం చూపింది.
ఎన్నో ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు తెలంగాణ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. శ్రీరామసాగర్ వరద కాలువ, దేవాదుల, సమ్మక్క బ్యారేజీ, సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ బ్యారేజీలకు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్(ఆర్.ఇ.సి.), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పి.ఎఫ్.సి.)ల నుంచి ఈ ఐదు ప్రాజెక్టులకు రూ.19,642.53 కోట్ల రుణం ఇచ్చేలా ఒప్పందం జరిగింది. రూ.14,253 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి. మరో రూ.5,388 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే, కార్పొరేషన్‌ల నుంచి తీసుకొన్న రుణాలనూ బడ్జెట్‌లో భాగంగానే చూడాలని కేంద్రం పేర్కొనడంతో సమస్య ప్రారంభమైంది. ఆర్.ఇ.సి, పి.ఎఫ్.సి.లు రెండూ గతానిది కాకుండా ఒప్పందం కొత్తగా మళ్లీ జరగాలని.. అది కూడా ఆర్‌బీఐ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరగాలని సూచించగా, దీనికి కార్పొరేషన్ అంగీకరించలేదు.
ఈ రెండింటి నుంచి రుణాలు నిలిచిపోగా, ఇందులో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికే రూ.3,015 కోట్లు రావాల్సి ఉంది. దేవాదులకు రూ.815 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.385 కోట్లు రుణం రావాల్సి ఉంది. మిగిలిన రెండు బ్యాంకుల నుంచి కూడా రూ.1,100 కోట్లు అందాల్సి ఉంది. యూనియన్ బ్యాంకు నిధులివ్వటం పూర్తిగా నిలిపివేయగా, ఇతర బ్యాంకులు ముందుకొస్తే తాము కూడా ఆలోచిస్తామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే మొత్తంలో బ్యాంకులు ఇచ్చే రుణం పోనూ మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఐదు ప్రాజెక్టులకు కలిపి రూ.5,807 కోట్లు మార్జిన్ మనీగా చెల్లించాల్సి ఉండగా, రూ.1,017 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. బ్యాంకుల నుంచి రుణంగా రావలసింది, ఇటు మార్జిన్ మనీతోపాటు పెరిగిన అదనపు వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే ఐదు ప్రాజెక్టులూ పూర్తిచేసేందుకు రూ.14,228 కోట్లు అవసరమని రెండురోజుల క్రితం నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో తేల్చారు. సీతారామ ఎత్తిపోతలలో గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులే రూ.500 కోట్లకు పైగా ఉంటే, భూసేకరణకు ఇవ్వాల్సింది సుమారు రూ.290 కోట్ల ఉంది.