తెలంగాణ

telangana

ETV Bharat / state

పూర్తిస్థాయిలో బ్యాంకింగ్​ సేవలు.. వేగవంతం దిశగా చర్యలు - ఆర్బీఐ

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో బ్యాంకింగ్‌ సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అయిదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, బిజినెస్​ కరస్పాండెంట్లు(బీసీలు) ఇలా ఏదో ఒక విధానంలో ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయి. ఖాతాదారులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో సెప్టెంబర్​ చివరి నాటికి మొత్తం 5,781 బ్రాంచ్​లు ఉన్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. ఈ మేరకు ఖాతాదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశలో బ్యాంకర్లు చర్యలు చేపట్టారు.

banking services are going to speed up in telangana
పూర్తిస్థాయిలో బ్యాంకింగ్​ సేవలు.. వేగవంతం దిశగా చర్యలు

By

Published : Nov 7, 2020, 1:23 PM IST

రాష్ట్రంలో బ్యాంకింగ్​ సేవలు.. ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. అయిదు కిలో మీటర్ల పరిధిలో ఏటీఎంలు, బ్రాంచులు, బీసీలు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పట్లో బ్యాంకింగ్​ సేవలు విస్తరించాల్సిన ఆవశ్యకత లేనందున ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అన్ని బ్యాంకులు చర్యలు చేపట్టాయి.

తెలంగాణలో ఈ సెప్టెంబరు చివరి నాటికి అన్ని బ్యాంకులకు చెంది మొత్తం 5,781 బ్రాంచ్​లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

వాటిలో

  • గ్రామీణ ప్రాంతాల్లో 1,797
  • సెమీ అర్బన్‌ కేంద్రాల్లో 1,297
  • అర్బన్‌ కేంద్రాల్లో 725
  • హైదరాబాద్‌ నగరంలో 1,962 శాఖలు పని చేస్తున్నాయి.

బ్యాంకింగ్​ అవుట్​లెట్లు

2011 జనాభా లెక్కల ప్రకారం ఆర్బీఐ నిబంధనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అయిదు కిలోమీటర్లలోపు ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. అయిదువేలు జనాభా మించి ఉన్న గ్రామాల్లో బ్యాంకు బ్రాంచ్​లు ఏర్పాటు చేయాలని 2015 డిసెంబరు 31వ తేదీన ఆర్బీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. బ్యాంకింగ్‌ సేవలు అందని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ అవుట్‌ లెట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని 2017 మే 18న మరొక సర్క్యులర్‌ ద్వారా ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఆయా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ బ్యాంకులు దాదాపు 200 అవుట్​లెట్లు ఏర్పాటు చేశాయి.

బీసీల ద్వారా సేవలు

గతేడాది చివరి నాటికి రాష్ట్రంలో మొత్తం బ్యాంకింగ్‌ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. అయితే ఆదిలాబాద్‌, కుమురం భీం, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జయశంకర్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని తొమ్మిది గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు అందడం లేదని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌(ఎస్ఎన్బీసీ) గుర్తించింది. వాటికి కూడా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్ఎన్బీసీ స్పష్టం చేసింది. దీంతో సంబంధిత బ్యాంకులు.. బిజినెస్‌ కరస్పాండెట్లను ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు కూడా సేవలను అందుబాటులోకి తెచ్చాయి.

మెరుగైన సేవల దిశగా

రాష్ట్రంలో ఇప్పట్లో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించాల్సిన అవసరం లేనందున ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా బ్యాంకర్లు దృష్టి సారించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అధిక శాతం ఖాతాదారులు డిజిటల్‌ లావాదేవీలకి మొగ్గు చూపుతుండగా బ్యాంకులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో అత్యధికంగా భారతీయ స్టేట్‌ బ్యాంకు 1,171 బ్రాంచ్​లు, యూనియన్‌ బ్యాంకు 780 బ్రాంచ్​లు కలిగి ఉండగా మిగిలిన 4,830 బ్రాంచ్​లు ఇతర బ్యాంకులకు చెందినవి.

ఇదీ చదవండి:అన్నదాతకు తప్పని అరిగోసలు... మద్దతు ధర లేక దిగాలు

ABOUT THE AUTHOR

...view details