రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. వైరస్ తీవ్రత బ్యాంకింగ్ రంగంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగిన బ్యాంకర్లు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు చెందిన సుమారు 8,762 మంది ఉద్యోగులకు మహమ్మారి సోకగా.. 35 మంది కొవిడ్ కాటుకు బలైనట్లు బ్యాంకు యూనియన్ నాయకులు తెలిపారు.
వైరస్ బాధితుల్లో అత్యధికంగా ఎస్బీఐ ఉద్యోగులు 3,945 మంది ఉండగా.. యూనియన్ బ్యాంకు ఉద్యోగులు 986 మంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు 245 మంది, కెనరా బ్యాంకు ఉద్యోగులు 947 మంది, ఇండియన్ బ్యాంకు ఉద్యోగులు 96 మంది, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు 679 మంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగులు 112 మంది, బ్యాంక్ ఆఫ్ బరోడా 724 మంది, యుకో బ్యాంకు 53 మంది, ఇతర బ్యాంకుల్లో మరో 975 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
పని వేళలు కుదించాలి..
కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు.. కరోనాకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. బ్యాంకుల పనివేళలు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేేేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఖాతాదారులకు సేవలు అందుబాటులో ఉండేట్లు చూడాలని, సాయంత్రం 4 గంటలకు బ్యాంకులు పూర్తిగా మూసివేసే విధంగా సమయాలను సవరించాలని గత నెల 21న ప్రభుత్వాన్ని కోరారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని బ్యాంకు యూనియన్ల ప్రతినిధులు తెలిపారు.