Banjara Hills DAV Public School incident: తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు ఈ విద్యాసంవత్సరం వరకు పునరుద్ధరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ డీఈవోను ఆదేశించారు.
అందులోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని మంత్రి తెలిపారు. విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికిప్పుడు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తే తమ పిల్లలను ఎక్కడికి పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.