Bandi Sanjay Letter to CM KCR : ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములను లాక్కుంటూ రియల్ వ్యాపారం చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటికాడి ముద్ద లాక్కోవడమేనన్నారు. దళితులకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులను మోసం చేశారని మండిపడ్డారు.
ఇదిగో.. అదిగో పోడు భూములకు పట్టాలిస్తాం అంటూ హామీలివ్వడవ్వమే తప్ప.. అమలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ దందాకు దళితులు, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరవైందన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని కోరారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.
బీసీలను దగా చేస్తున్నారు..: రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు. బీసీలకు కేసీఆర్.. గొర్లు, బర్లు తప్ప ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించింది కేవలం రూ.5 వేల కోట్లేనని.. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజయ్యను అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులే ఇచ్చి.. రాజకీయంగా అణగదొక్కారని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని బండి పిలుపునిచ్చారు. రూ.16 వందల కోట్లతో సచివాలయం మాత్రం పూర్తి చేశారని.. బీసీ ఆత్మ గౌరవ భవనాన్ని కేసీఆర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని బండి ప్రశ్నించారు.
ఇవీ చదవండి