భారీ వరదల నేపథ్యంలో భాగ్యనగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల సమస్యలను తెలుసుకోవడానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ చెరువు కింది ముంపు ప్రాంతాలైన రెడ్డి కాలనీ, సాగర్ ఎన్క్లేవ్ కాలనీ, హయత్ నగర్లోని బంజారా కాలనీ, మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లోని ఎంఎల్ఆర్ కాలనీ, మిథులానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. దొరల గడీల పాలనను బద్దలు కొట్టే రోజు దగ్గరలో ఉందని, 6 ఎకరాల ఉన్న బైరామల్ గూడ చెరువు ప్రస్తుతం 2 ఎకరాలు ఉందన్నారు. ఆక్రమణలకు గురైన చెరువుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటికి రావాలి: బండి సంజయ్ - floods in hyderabad
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చి ప్రజల కష్టాలను పట్టించుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. వరదల నేపథ్యంలో ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటించారు. వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉంటే ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని, తమను ప్రగతి భవన్కు వచ్చేటట్లు చేయొద్దని... ముఖ్యమంత్రి బయటికి రావాలని సూచించారు. వరద ఉద్ధృతితో మృతి చెందిన చెందిన వారందరికీ 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ పనీతీరుని ప్రజలందరూ గమనిస్తున్నారని... అదే ప్రజలు త్వరలో ముఖ్యమంత్రి బుద్ధి చెబుతారన్నారు. ప్రస్తుతం నగరంలో కార్లు నీళ్లలో మునిగి ఉన్నాయని... వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కారును నీటిలో ముంచడం ఖాయమన్నారు.
ఇవీ చూడండి: 'వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం'