కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే హెల్త్ బులెటిన్‌లో పారదర్శకత లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దేనికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టిమ్స్‌ను వెంటనే ప్రారంభించాలి : బండి సంజయ్ - కోఠి ఆస్పత్రి వద్ద బండి సంజయ్ ఆందోళన
కరోనా కట్టడిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో కోఠి ఆరోగ్య సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు బయల్దేరిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో డాక్టర్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు.
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళనలకు భాజపా పిలుపు నిచ్చింది. కోఠి కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు కార్యాలయం ముట్టడికి యత్నించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, విజయ రామారావు, పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని.. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్