Bandi Sanjay Response to KTR Challenge : మంత్రి కేటీఆర్ సవాలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎంపీ అర్వింద్‌ను కవిత చెప్పుతో కొడతానని.. సీఎం కేసీఆర్ ముక్కలు చేస్తానని అన్న విషయాలను గుర్తు చేశారు. పొగాకు తింటానని తనపై ఆరోపణలు చేసినప్పుడు.. తాను సవాల్ విసిరినప్పుడు ఏమి చేశారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో దొరక్కుండా ఉండేందుకు విదేశాల్లో చికిత్స తీసుకున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు కేటీఆర్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎందుకు ఆగిందని బండి సంజయ్ ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుపై ప్రశ్నిస్తే నలుగురిని పట్టుకుని మమ అనిపిస్తారని విమర్శించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారని అనుకుంటున్నారు.. కానీ ఆయన సీఎం కాకముందే చెప్పులతో కొడతానంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగుళూరు డ్రగ్ కేసుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ నిలదీశారు.
మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే రజాకారుల పాలన పునరావృతం అవుతుందని బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి రైల్వే వంతెనకు రాష్ట్ర వాటా ఇవ్వాలని తెలిపారు. రూ.80 కోట్లు ఇస్తే పనులు వెంటనే ప్రారంభం అవుతాయని అన్నారు. గంగాధర రైల్వే పైవంతెనకూ నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ కోసం చాలా చేస్తామని చెప్పారని.. అవన్నీ హామీలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.